భూమి కోసమే కాంగ్రెస్ నేత హత్య
నిందితుల అరెస్ట్
దుబ్బాకటౌన్: కాంగ్రెస్ నేత హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం రాత్రి దుబ్బాక సర్కిల్ కార్యాలయంలో సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. దుబ్బాక మున్సిపల్ చెల్లాపూర్ వార్డుకు చెందిన రామవ్వ 1993లో 11 ఎకరాల భూమిని కుమార్తె నూతి రాధపై రిజిస్ట్రేషన్ చేసింది. దీంతో ఆమె కుమారుడు పెద్ద బాల్‌రెడ్డి, కోడలు రేణుక ఆ భూమిని తమ పేరున రిజిస్ట్రేషన్ చేయాలని రాధపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో 30 ఏళ్లుగా అన్నా, చెల్లెలు మధ్య భూ వివాదం కొనసాగుతూ వస్తోంది. కాగా గత సంవత్సరం జూలైలో పెద్ద బాల్‌రెడ్డి అనారోగ్యంతో మరణించాడు. దీంతో ఇదే అదనుగా భావించిన వారి సమీప బంధువు, కాంగ్రెస్ నాయకుడు వంగ బాల్‌రెడ్డి (61) వివాదాస్పద భూమి విషయంలో మధ్యవర్తిగా రావడంతో గొడవలు జరుగుతున్నాయి. దీనికి తోడు భూమి విషయంలో పలుమార్లు కాంగ్రెస్ నేత పెద్దబాల్ రెడ్డి భార్య రేణుకను బెదిరించాడు. ఈ క్రమంలో వివాదాస్పద ఆ భూమిని తన సోదరికి ఇప్పించుకున్నాడు. దీంతో వంగ బాల్‌రెడ్డిని చంపితేనే అతని సోదరి నీరజ తమకు భయపడి, తమ పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ చేస్తుందని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న కత్తి తీసుకొని వ్యవసాయ బావి వద్ద ఒంటరిగా ఉన్న బాల్‌రెడ్డిని నిందితులైన రేణుక, ఆమె కుమారుడు సోమేశ్వర్ రెడ్డి ఛాతీపై, వీపు వెనక భాగంలో పొడిచారు. అతడు మృతి చెందడంతో అక్కడి నుంచి పరారయ్యారు. దుబ్బాక సీఐ రాజేశ్ అదుపులోకి తీసుకొని విచారించగా తామే చంపినట్లు అంగీకరించారు. అనంతరం వారివద్ద నుంచి కత్తిని, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకొని, రిమాండుకు తరలించారు.


