
అగ్రగామిగా అవతరించాలి
పటాన్‌చెరు/పటాన్‌చెరు టౌన్: అభివృద్ధి చెందుతున్న దేశం అనే మాట పోవాలి...అభివృద్ధి చెందిన భారత్‌గా రూపొందాలి. ప్రపంచ దేశాలకు భారత్ అగ్రగామిగా అవతరించాలి. ఇది నేటి యువత ఆకాంక్ష. అందరికీ విద్య అందుబాటులో ఉండటంతోపాటు చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం రావాలి. సాంకేతికతలో భారత్‌లో కీలకపాత్ర పోషించాలి. ఇదంతా అవినీతిరహిత పాలనతోనే సాధ్యం అని యువత బలంగా కోరుకుంటోంది. భారత్ 2047లో జరుపుకునే వందేళ్ల స్వాతంత్య్ర దినోత్సవానికి దేశం ఎలా ఉండాలనే అంశంపై‘సాక్షి’ఆధ్వర్యంలో పట్టణంలోని ఏపీజే అబ్దుల్ కలామ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన టాక్‌షోలో యువత తమ అభిప్రాయాలను, ఆకాంక్షలను వెలిబుచ్చారు.
అవినీతిరహిత భారత్ కావాలి
అవినీతిరహిత పాలనకు భారత్ దిక్సూచిగా మారాలి. పాలకులు నిస్వార్థంగా ఉండాలి. దేశం ఇప్పటికీ సామాజిక రుగ్మతలు, వెనుకబాటుతనంతో కునారిల్లుతోంది. దీనంతటికీ అవినీతి పాలనే కారణం. ప్రతీ చోట లంచాలు ఇవ్వాల్సి వస్తోంది. అవినీతి రహిత పాలన సాగాలి.
–కార్తీక్, బి.ఎ.ద్వితీయ ఏడాది,
పటాన్‌చెరు.
అన్నిరంగాల్లో ఉన్నతస్థాయికి
సాంకేతికంగా దేశం ఎంతో అభివృద్ధి సాధించింది. అన్ని రంగాల్లోనూ దేశం ఉన్నత స్థాయికి చేరుతోంది. మన దేశం అగ్రగామి దేశంగా అవతరించాలి. ఇప్పటికే ఎంతోమంది శాస్త్రవేత్తలు, ప్రముఖ సంస్థల సీఈఓలు మన దేశం వారేకావడం ఇందుకు నిదర్శనం.
–సంతోషి, బి.ఎ. ఫస్టియర్,
గుండూరు గ్రామం
మనమే నంబర్‌వన్ కావాలి
దేశం ప్రగతి పథంలో దూసుకుపోతుంది. మరింత అభివృద్ధి చెందాలి. అన్ని అవసరాలకు ప్రపంచ దేశాలన్నీ భారత్‌వైపు చూడాలి. అన్ని రంగాల్లోనూ మనమే నంబర్‌వన్‌గా ఉండాలి. ప్రపంచానికి భారత్ పెద్దన్న పాత్ర పోషించేస్థాయికి ఎదగాలి.
– ఎస్.జ్ఞానేశ్వర్, బి.ఎ. ఫస్టియర్, బాచుపల్లి.
నిరుద్యోగరహిత భారత్
చదువుకున్న వారందరికీ ఉద్యోగాలు దొరకాలి. దేశంలో ఒక్క చదువుకున్న నిరుద్యోగి కూడా ఉండకూడదు. చదువుకున్న యువత మనం ఎందుకు చదువుకున్నామా అనే పరిస్థితి రాకుండా చూడాలి. అందరికీ ఉద్యోగాలు దొరికేలా కోర్సులు ప్రవేశపెట్టాలి. విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలి.
– అక్షర సాయి, బి.ఎ, ఫస్టియర్, వికారాబాద్
విద్య, వైద్యం అందరికీ అందుబాటులో..
దేశంలో అన్ని వర్గాల వారికి విద్య, వైద్యం అందుబాటులో ఉండాలి. అందరూ చదువుకోవాలి. వంద శాతం అక్షరాస్యత సాధించాలి. దేశంలో నెలకొన్న అన్ని సమస్యలకు విద్య ద్వారానే పరిష్కారం లభిస్తుంది. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు ప్రభుత్వమే అందరికీ ఉచితంగా అందించాలి.
– ఎస్.తనుశ్రీ, బి.ఎ, సెకండియర్
ప్రజా సమస్యలకు ప్రత్యేక వ్యవస్థ
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఉండాలి. ప్రజా సమస్యల్ని ప్రభుత్వమే గుర్తించి సత్వరమే పరిష్కరించాలి. ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కారం వచ్చేలా చర్యలు తీసుకోవాలి.
–ఎస్.నవీన్, బి.ఎ.ఫస్టియర్, గండిగూడెం
.
అవినీతి, నిరుద్యోగరహితదేశంగా ఉండాలి
అందరికీ ఉచిత విద్య, వైద్యం అందాలి
విద్య, వైజ్ఞానిక రంగాల్లోభారత్ దిక్సూచి కావాలి
పటాన్‌చెరు డిగ్రీ కళాశాలలోసాక్షి టాక్‌షోలో యువత ఆకాంక్షలు