మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి
ఎస్పీ పరితోష్ పంకజ్
పటాన్‌చెరు టౌన్: సివిల్ తగాదాలలో తలదూర్చకూడదని, మిస్సింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ స్పష్టం చేశారు. బీడీఎల్ పోలీసు స్టేషన్‌ను శుక్రవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను, స్టేషన్ రికార్డులను పరిశీలించారు. దర్యాప్తులో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడాలని, సిబ్బంది, అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. నైట్‌బీట్, పెట్రోలింగ్ అధికారులు వీధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రధాన కూడళ్లలో ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో బీడీఎల్ ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.


