ఉద్యోగం చేస్తూనే ఆన్‌లైన్ కోచింగ్..
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): ఉన్నత విద్యా కుటుంబంలో పుట్టి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో గ్రూప్ 1లో రాష్ట్ర స్థాయిలో 26వ ర్యాంకు సాధించి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది కప్పే పూజ యాదవ్. ఫలితాల్లో 509.5 మార్కులు సాధించింది. జహీరాబాద్ మండలంలోని చిన్న హైదరాబాద్ గ్రామానికి చెందిన దండు అలియాస్ కప్పే అంజయ్య (రిటైర్డ్ ఎంఈఓ), జయశ్రీ (ఎంఏ బీఎడ్)ల పెద్ద కూతురే పూజ యాదవ్. వీరు ప్రస్తుతం సంగారెడ్డి పట్టణంలోని ఆదర్శ్ జిమాక్స్ కాలనీలో నివసిస్తున్నారు. బీటెక్ పూర్తి చేసిన పూజ ఇప్పటికే గ్రూప్ –4 సాధించి గురుకుల పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తోంది. కాగా గ్రూప్స్‌కు ఆన్‌లైన్‌లో కోచింగ్ తీసుకొని ప్రతిభ కనబర్చింది. సివిల్స్ లక్ష్యంగా ముందుకు సాగుతానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు అభినందించారు.


