గెలుపు గుర్రాలకే టికెట్లు!
జహీరాబాద్: అస్మదీయులని టికెట్లిస్తే అసలుకే మోసం వస్తుందనే భయం ప్రధాన పార్టీల నేతలను వెన్నాడుతోంది. అస్మదీయులని పార్టీపరంగా ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లో మద్దతిస్తే ఓటమిపాలైన ఘటనలు మున్సిపల్ ఎన్నికల్లో పునరావృతం కాకూడదని కేవలం గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని ప్రధాన పార్టీల నేతలు భావిస్తున్నారు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేయాలనుకుంటున్న ఆశావహులకు అంతసునాయాసంగా టికెట్లు దక్కే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది. అస్మదీయులకు టికెట్లిచ్చే బదులు ప్రజాబలం కలిగి ఉన్న వారికే టికెట్లిచ్చి సంఖ్యాబలం పెంచుకోవాలని ప్రధాన పార్టీల నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, మజ్లిస్ పార్టీల ముఖ్య నేతలు మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి.
చైర్ పర్సన్ పదవి దక్కాలంటే..
మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కో కౌన్సిలర్ పదవికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. చైర్ పర్సన్ పదవిని దక్కించుకోవాలంటే అవసరం మేరకు సంఖ్యాబలం సమకూర్చుకోవాల్సిందే. దీంతో టికెట్ల కేటాయింపు అంత సులువు కాదనే ప్రచారం సాగుతోంది. జహీరాబాద్ మండలంలోని శేఖాపూర్, కొత్తూర్(బి), హోతి(బి), బూచనెల్లి, బూర్దిపాడ్, అల్గోల్, రాయిపల్లి(డి), కోహీర్ మండలం పైడిగుమ్మల్ గ్రామాల్లో పంచాయతీ పోరులో కాంగ్రెస్ మద్దతుదారులు ఓటమి పాలుకాగా, పలు గ్రామాల్లో మనోళ్లని మద్దతిచ్చిన బీఆర్‌ఎస్ సైతం సదరు అభ్యర్థుల ఓటమితో ఖంగుతింది. పంచాయతీ ఎన్నికల అనుభవాలనే గుణపాఠంగా తీసుకుంటున్న ప్రధాన పార్టీల నేతలు పురపోరుకు సంబంధించిన టికెట్ల కేటాయింపు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
ప్రజాభిప్రాయం మేరకే..
ఆయా వార్డుల్లో ప్రజాభిప్రాయం మేరకే ప్రధాన పార్టీలు టికెట్లను కేటాయించే అవకాశముంది. ఈ విషయంలో సంబంధిత వార్డుల్లోని పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు, ముఖ్య కార్యకర్తల అభిప్రాయాలు, సూచనలు పరిగణలోకి తీసుకున్న తర్వాతే టికెట్లను ఫైనల్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఒక్కో వార్డులో నాలుగైదు మంది వరకు ఆశావహులున్నా వారిలో ప్రజల మద్దతు ఎక్కువగా ఎవరివైపు ఉందనే విషయాలను ఆయా పార్టీల అధిష్టానం పరిగణలోకి తీసుకుని టికెట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
సీనియారిటీ కోట అనుమానమే
పార్టీనే నమ్ముకుని పని చేస్తున్నామని, కష్టకాలంలో పార్టీకి అండగా ఉండి పని చేశామని వీటిని పరిగణలోకి తీసుకుని టికెట్లు కేటాయించాలని పార్టీ శ్రేణుల వైపు నుంచి నేతలపై ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. వీటిని పక్కన పెట్టి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న నేతలు సీనియారిటీ కోటపై ఆసక్తిగా లేనట్లు ప్రచారం సాగుతోంది. గెలిచే వ్యక్తి పక్క పార్టీకి చెందిన వారైనా టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆయా పార్టీల కార్యకర్తలు పేర్కొంటున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో జహీరాబాద్ మండలం శేఖాపూర్ గ్రామ సర్పంచ్ పదవి కోసం కాంగ్రెస్ మద్దతు కోరగా నిరాకరించడంతో బీఆర్‌ఎస్ మద్దతుతో గెలుపొందిన ఘటనలు పురపోరులో ఎదురుకాకూడదని ఆయా పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పురపోరును ప్రతిష్టాత్మకంగాతీసుకుంటున్న పార్టీలు
అస్మదీయులకు టికెట్లిచ్చేఅవకాశాలు తక్కువే
సర్పంచ్ ఎన్నికల్లో తమవారికి టికెట్లిచ్చి చేతులు కాల్చుకున్న నేతలు
ప్రధాన పార్టీల టికెట్ల కోసం ఆశావహుల్లో పోటీ


