అక్రమ నిర్మాణాలకు అడ్డేది!
సంగారెడ్డి: పట్టణంలో అక్రమ నిర్మాణాలకు అడ్డే లేకుండా పోతోంది. మున్సిపల్ అధికారుల అలసత్వాన్ని అదనుగా తీసుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. సంగారెడ్డి మున్సిపల్ పరిధిలోని 34 వార్డ్ రాంచంద్రరెడ్డి కాలనీలోని సర్వే నంబర్ 403లోని ఎల్‌పీ నంబర్ 18/91 లే అవుట్‌లోని పార్క్ ఖాళీ స్థలంలో వేరే సర్వేనంబర్‌తో అక్రమ నిర్మాణం చేస్తున్నారు. ఇదే విషయాన్ని సదరు కాలనీవాసులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా అక్రమార్కులపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కొన్ని నెలల క్రితం కలెక్టరేట్‌లో సైతం ఫిర్యాదు చేయగా హద్దులు నిర్ణయించి పార్క్ ఖాళీ స్థలాన్ని అక్రమార్కులనుంచి కాపాడాలని సర్వే శాఖ ఏడీ, మున్సిపల్ కమిషనర్‌కు కలెక్టర్ ఆదేశించారు. అయినప్పటికీ హద్దులు నిర్ణయించడంలో అధికారులు అలసత్వం చూపుతుండటంతో కాలనీవాసులు ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ ఫిర్యాదు చేయగా తగిన చర్యలను తీసుకోవాలని సీఎం పేషీ నుంచి హెచ్‌ఎండీఏ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. పార్క్ ఖాళీ స్థలం ఆక్రమణపై పక్షం రోజుల్లో నివేదికను పంపించాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించినా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో అక్రమార్కులతో కుమ్మకై ్క అక్రమ నిర్మాణానికి వంతపాడుతున్నారేమోనని స్థానిక అధికారులపై కాలనీవాసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పార్క్ స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలు తొలగించి పార్క్ స్థలం కాపాడాలని కోరుతున్నారు.
సీఎం పేషీ ఆదేశాలు బేఖాతర్
పట్టించుకోని అధికారులు


