ఉత్కంఠకు తెర!
నేడు వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రకటన
● అన్ని రాజకీయ పార్టీలప్రతినిధుల సమక్షంలో ఖరారు
● చైర్‌పర్సన్ స్థానాల రిజర్వేషన్లపైనారానున్న స్పష్టత!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మున్సిపల్ రిజర్వేషన్‌పై శనివారం స్పష్టత రానుంది. ఇప్పటికే ఆయా సామాజికవర్గాలకు కౌన్సిలర్, చైర్‌పర్సన్ స్థానాలను ఖరారు చేస్తూ జీఓ జారీ అయిన విషయం విదితమే. అయితే శనివారం ఏ వార్డు కౌన్సిలర్ స్థానం ఏ సామాజికవర్గానికి రిజర్వు అవుతుందనే దానిపై కలెక్టర్ నేతృత్వంలో అధికారులు ప్రకటించనున్నారు. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఉంటాయని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అలాగే మహిళా రిజర్వుడు కౌన్సిలర్ స్థానాలను కూడా ప్రకటించనున్నారు. డ్రా పద్ధతిలో ఖరారు చేస్తారు. జిల్లాలో 11 మున్సిపాలిటీలు ఉండగా..వీటి పరిధిలో 256 కౌన్సిలర్ స్థానాలున్నాయి.
చైర్‌పర్సన్ స్థానాలను ప్రకటించనున్న
రాష్ట్ర ఉన్నతాధికారులు
చైర్‌పర్సన్ స్థానాల రిజర్వేషన్లను రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రకటించనున్నారు. రొటేషన్ పద్ధతిలో ఈ రిజర్వేషన్లు ఉండటంతో గత ఎన్నికల్లో రిజర్వు అయిన స్థానం కాకుండా, మరో సామాజికవర్గానికి ఈ చైర్ పర్సన్ పదవి రిజర్వు కానుంది. మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టరేట్ చైర్‌పర్సన్ స్థానాల రిజర్వేషన్లను ప్రకటిస్తుందని జిల్లా అధికారులు చెబుతున్నారు.
రిజర్వేషన్లు ఖరారైతే
టికెట్ల కేటాయింపు
వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారైన వెంటనే రాజకీయ పార్టీలు అభ్యర్థిత్వాల ఎంపికపై పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలకు సన్నద్ధమయ్యాయి. ఆయా వార్డుల కౌన్సిలర్ స్థానాల పార్టీ టికెట్లు ఆశిస్తున్న ఆశావహులతో జాబితాలను రూపొందించాయి. రిజర్వేషన్లు ఫైనల్ అయిన వెంటనే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని నాయకులు పేర్కొంటున్నారు.
ఇక నోటిఫికేషనే తరువాయి..
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తుది ఓటరు జాబితాను వారం క్రితమే అధికారులు ప్రకటించారు. వార్డులవారీగా పోలింగ్ కేంద్రాలు కూడా ఖరారయ్యాయి. ఇప్పుడు రిజర్వేషన్ల ప్రక్రియ ముగిస్తే ఎన్నికల నగారా మోగించేందుకు అన్ని ప్రక్రియలు పూర్తయితాయి. ఆ వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలున్నట్లు రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.
నేడు రాజకీయ
పార్టీలతో సమావేశం
మున్సిపల్ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలతో శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లో కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాలని జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు సమాచారం ఇచ్చారు. ఆయా పార్టీల ప్రతినిధుల సమక్షంలో రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు.


