ఆధిపత్యం ఆమెదే!
నారాయణఖేడ్: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలో గెలుపోటములు నిర్ణయించే కీలక భూమికను మహిళలు పోషించనున్నారు. ఇటీవల ప్రకటించిన మున్సిపాలిటీ ఓటర్ల తుది జాబితాలో పురుషులకంటే 2,419మంది మహిళలు అధికంగా ఉన్నారు. ఇక జిల్లాలోని మెజార్టీ మున్సిపాలిటీలో మహిళా ఓటర్లే అధికంగా ఉండటం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ మహిళలకు సంక్షేమ పథకాలపేరిట పెద్దపీట వేస్తూ ప్రచారానికి సిద్ధమవుతుండగా బీఆర్‌ఎస్, బీజేపీ సైతం మహిళలను ఆకట్టుకుని ఓట్లు సంపాదించుకోవాలన్న ఆలోచనతో ఉన్నాయి. జిల్లాలో మొత్తం 11 మున్సిపాలిటీలకు సంబంధించి ఈనెల 12న ప్రకటించిన ఓటర్ల తుదిజాబితాలో మొత్తం ఓటర్లు 3,42,659మంది కాగా అందులో 1,72,521మంది మహిళలు, పురుషులు 1,70,102, ఇతరులు 26 మంది ఉన్నారు. ఏడు మున్సిపాలిటీల్లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది.
50% సీట్లు వారికే...
సా్థనిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రకారం మహిళలకు 50% సీట్లు కేటాయిస్తారు. ఇవే కాకుండా మిగతా 50% సీట్లలో జనరల్ కేటగిరీకి కేటాయించే స్థానాల్లో మహిళలు పోటీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రతీ ఎన్నికల్లోనూ మహిళా ఓటర్లే అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయిస్తున్నారు. దీంతో వివిధ పార్టీలకు చెందిన నాయకులు మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా తమ కార్యాచరణ చేపడుతున్నారు.
మహిళా ఓటర్లు అధికంగా ఉన్న
మున్సిపాలిటీలు ఇవే.
మున్సిపాలిటీ మహిళలు పురుషులు
ఇస్నాపూర్ 18,751 17,075
సంగారెడ్డి 42,221 41,719
జహీరాబాద్ 39,467 39,352
సదాశివపేట్ 18,905 18,226
జోగిపేట 8,567 7,893
జిన్నారం 6,522 6,162
ఇంద్రేశం 6,593 6,546
పురపోరు ఓటర్లలో మహిళలేఅత్యధికం
గెలుపోటముల నిర్ణయాత్మకశక్తిగా అతివలు


