సిద్దిపేటకమాన్: బావిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్దిపేట పట్టణ శివారులో చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ ఉపేందర్ కథనం మేరకు.. స్థానిక నర్సాపూర్‌లో నివాసం ఉంటున్న బండారి పోశవ్వ (60) తమకు ఉన్న గొర్రెలను పెద్దవాగు వైపు ప్రతి రోజూ తీసుకెళ్లి మేపేది. తమ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో గొర్రెలను అమ్మేయడంతో నిత్యం బాధపడుతుండేది. 16న భర్తతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం నర్సయ్య వ్యవసాయ బావిలో మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. గొర్రెలు అమ్మడంతో మనస్తాపానికి గురై తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి కుమారుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కుటుంబ కలహాలతో వ్యక్తి
దుబ్బాకటౌన్ : కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాయపోల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మంగళవారం స్థానిక పోలీసుల కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన గూని ఎల్లం (40) వ్యవసాయం, కూలీ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. కొద్ది రోజులుగా మద్యానికి బానిసై భార్య నవనీతతో గొడవ పడుతుండేవాడు. సోమవారం రాత్రి భార్యాభర్తలు గొడవపడ్డారు. కుటుంబ సభ్యులు రాత్రి భోజనం చేసి నిద్రించిన తర్వాత అర్థరాత్రి సమయంలో ఎల్లం ఇంట్లో నుంచి వెళ్లి పొలం వద్ద ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య నవనీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రాయపోల్ ఎస్సై రఘుపతి తెలిపారు.
ఉరేసుకొని యువకుడు
నిజాంపేట(మెదక్): ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజాంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. నిజాంపేట మండల కేంద్రానికి చెందిన గర్గుల రాజు, లలిత దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు గర్గుల భాను(17) పదవ తరగతి పూర్తి అయిన తర్వాత గ్రామంలోనే కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం తల్లిదండ్రులు వేరే గ్రామానికి వెళ్లగా భాను ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటిలో నుంచి శబ్ధం రాకపోవడంతో పక్క ఇంట్లో ఉన్న స్నేహితుడు వెళ్లి చూశాడు. తాడుకు వేలాడుతున్న మిత్రుడిని చూసి ఇంటి తలుపులు పగులగొట్టి 108లో దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. డాక్టర్లు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
బావిలో దూకి వృద్ధురాలు బలవన్మరణం
గొర్రెలు అమ్మేశారని మనస్తాపంతో..