కొట్టారు.. తిట్టారు! | - | Sakshi
Sakshi News home page

కొట్టారు.. తిట్టారు!

Feb 8 2024 5:52 AM | Updated on Feb 8 2024 12:30 PM

అనురాగ్‌ యూనివర్సిటీలో చిన్నకోడూరు విద్యార్థిఆత్మహత్యాయత్నం
● అధ్యాపకుల వేధింపులే కారణమన్న కుటుంబీకులు ● గోప్యంగా ఉంచేందుకు యత్నించిన యాజమాన్యం ● పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

పోచారం: మేడ్చల్‌– మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం వెంకటాపూర్‌లోని అనురాగ్‌ యూనివర్సిటీలో బుధవారం ఓ విద్యార్థి ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం కలకలం రేపింది. అధ్యాపకుల వేధింపుల కారణంగానే విద్యార్థి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి బంధువుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ గ్రామానికి చెందిన నక్కిరెడ్డి జ్ఞానేశ్వర్‌రెడ్డి ఇక్కడి అనురాగ్‌ యూనివర్సిటీలో బీటెక్‌ (సీఎస్‌ఈ) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. నాలుగు రోజుల క్రితం వచ్చిన మొదటి సెమిస్టర్‌ ఫలితాల్లో నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ కావడంతో జ్ఞానేశ్వర్‌ ఒత్తిడికి గురై ఆందోళన చెందుతున్నట్లు తోటి విద్యార్థులు గమనించారు.

అందరి ముందు అవమానించడంతో..

ఇదిలా ఉండగా.. హెయిర్‌ కటింగ్‌ చేయించుకోలేదని జ్ఞానేశ్వర్‌ను డీన్‌ శ్రీనివాసరావుతో పాటు ఫిజికల్‌ ట్రైనర్‌ మంగళవారం అందరి ముందు అవమానించడంతో పాటు కొట్టారు. ఇదే విషయాన్ని జ్ఞానేశ్వర్‌ తన తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి బాధను వ్యక్తం చేశాడు. రెండు రోజుల్లో యూనివర్సిటీకి వచ్చి యాజమాన్యంతో మాట్లాడతామని నచ్చచెప్పారు. కానీ.. తనకు జరిగిన అవమానం తట్టుకోలేని జ్ఞానేశ్వర్‌ బుధవారం మధ్యాహ్నం యూనివర్సిటీలోని సీ బ్లాక్‌ రెండో ఫ్లోర్‌ నుంచి దూకి ఆత్మహత్యా యత్నం చేశాడు. చికిత్స నిమిత్తం అతడిని యూనివర్సిటీకి చెందిన నీలిమ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షించి పక్కటెముకలు విరిగినట్లు చెప్పారు. విద్యార్థి ఆత్మహత్యా యత్నాన్ని గోప్యంగా ఉంచేందుకు యూనివర్సిటీ యాజమాన్యం ప్రయత్నించడం పలు అనుమానాలకు తావిస్తోంది. పరిస్థితి విషమించే తరుణంలో సంఘటన గురించి యాజమాన్యం చెప్పడంతో కుటుంబ సభ్యులు అదేరోజు సాయంత్రానికే ఆస్పత్రికి చేరుకున్నారు. మొదటి సెమిస్టర్‌లో ఫెయిల్‌ అయ్యావని, కళాశాలకు క్రమం తప్పకుండా రావడంలేదని, వచ్చినా ఆలస్యంగా వస్తున్నావని ఏదో ఒక కారణం చూపించి వేధించడంతో జ్ఞానేశ్వర్‌ తట్టుకోలేక ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు జ్ఞానేశ్వర్‌ బంధువులు ఆరోపించారు. విద్యార్థులను అవమానించి, శారీరకంగా హింసించే హక్కు మీకు ఎవరిచ్చారని అధ్యాపకులను నిలదీశారు. ఆత్మహత్యా యత్నానికి కారకులైన అధ్యాపకులతో పాటు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని జ్ఞానేశ్వర్‌ అన్న సాత్విక్‌రెడ్డి పోచారం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. జ్ఞానేశ్వర్‌ను తాము కొట్టలేదని డీన్‌ శ్రీనివాసరావు వివరణ ఇచ్చారు. హెయిర్‌ కటింగ్‌ చేయించుకోమని ఒత్తిడి చేయలేదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement