తెలంగాణ 2022 పొలిటికల్‌ రౌండప్‌: కమలం బండి ఎట్లా నడిచిందంటే..

Year Round Up Telangana BJP Politics 2022 - Sakshi

సవాళ్లు.. ప్రతిసవాళ్లు..
ఆరోపణలు.. ప్రత్యారోపణలు
ప్రమాణాలు.. ప్రతిజ్ఞలు..
పాదయాత్రలు.. సభలతో తెలంగాణ కమలం పార్టీ ఈ యేడాది దూకుడుగా జనంలోకి వెళ్లే ప్రయత్నం చేసింది. 

ఈ యేడాది మొత్తం కాషాయ పార్టీ సెంట్రిక్ గానే తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగాయి. అధికారంగా తెలంగాణ విమోచన దిన వేడుకలు నిర్వహించడం.. మునుగోడు ఉప ఎన్నిక..  ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలు.. యాదాద్రి కొండపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రమాణాలతో   2022 బీజేపీ తెలంగాణ రాజకీయాల్లో రక్తికట్టించిన పరిణామాలను ఒకసారి తిరగేస్తే.. 

భళా బండి
2022లో తెలంగాణ రాజకీయాలన్నీ కాషాయ పార్టీ కేంద్రంగానే సాగాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మొదలుకొన్ని బండి సంజయ్ పాదయాత్రల వరకు ప్రజల్లో నిత్యం పార్టీపై చర్చ సాగే విధంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ యేడాది జూలై 2,3,4 హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు. కీలకమైన ఈ సమావేశాల్లోప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీ.ఎల్.సంతోష్ తో పాటు 350 మంది జాతీయ స్థాయి నేతలు పాల్గొన్నారు. దేశంలో పార్టీ బలోపేతంతో పాటు పలు కీలక అంశాలపై తీర్మానాలు చేశారు. తెలంగాణ బీజేపీ చరిత్రలోనే పరేడ్ గ్రౌండ్స్ లో అతిపెద్ద బహిరంగ సభ నిర్వహించి.. ప్రధాని మోడీతో భళా అనిపించుకున్నారు తెలంగాణ కమలదళపతి.

తెలంగాణపై బీజేపీ అగ్రనేతలు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణలో ఈ యేడాది నాలుగు సార్లు పర్యటించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఐదు సార్లు పర్యటించి పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా..  ఐదుసార్లు రాష్ట్రంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరే కాదు.. పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు వివిధ సందర్భాల్లో పర్యటించి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు.

టీఆర్‌ఎస్‌పై పీఎం ఫైర్‌
ఈ ఏడాది ఆరంభం నుంచే తెలంగాణ ప్రభుత్వానికి.. బీజేపీ నేతలకు మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినప్పుడల్లా.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గైర్హాజరవుతూ వస్తున్నారు. ప్రధాని గౌరవ ఆహ్వానానికి సైతం వెళ్లలేదు ఆయన. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ధి వేడుకలకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఇందులో భాగంగా.. ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ ముచ్చింతల్ పర్యటించారు. ఆ తర్వాత మే 26వ తేదీన గచ్చిబౌలి ఐఎస్బీలో నిర్వహించిన కార్యక్రమం కోసం ప్రధాని వచ్చారు. ఆ సమయంలో బేగంపేట ఎయిర్ పోర్ట్ లో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. అధికార టీఆర్‌ఎస్‌ తీరును ఆ సభలో ఎండగట్టారు. జూలై 2,3,4 తేదీల్లో నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. జూలై 4వ తేదీన పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సభలో ప్రధాని మోడీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. నవంబర్12న రామగుండంలో ఎరువుల కార్మాగార ప్రారంభోత్సవ సందర్భంగా.. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ బయట ఏర్పాటుచేసిన సభలో తెలంగాణ ప్రభుత్వం అవినీతిమయమంటూ తీవ్రస్థాయిలో ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. 

యాక్టివ్‌గా షా
మరోపక్క.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ బీజేపీ నేతలతో టచ్ లో ఉంటూ దిశానిర్ధేశం చేస్తున్నారు. ఎప్పుడు అవసరమైనా వస్తా అంటూ తెలంగాణ కమలదళానికి భరోసా ఇచ్చారు. సెప్టెంబర్17 న హైదరాబాద్ విమోచన వేడుకలను తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టింది. స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా... పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత పాదయాత్రకు సంబంధించి  మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో నిర్వహించి ముగింపు సభలో అమిత్ షా పాల్గొన్నారు. కేసీఆర్ ను ఓడించడానికి బండి సంజయ్ ఒక్కడు చాలంటూ.. అమిత్ షా ఆ సభలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి, పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆగస్ట్ 21న బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆగస్టు 21న మునుగోడులో రాజగోపాల్ రెడ్డి చేరిక సభలోనూ అమిత్ షా పాల్గొన్నారు.

నడా ప్రత్యేక దృష్టి
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ... రాష్ట్రంలో ఐదుసార్లు పర్యటించారు. జాతీయ కార్యవర్గ సమావేశాలతో పాటు.. బండి సంజయ్ నిర్వహించిన పాదయాత్ర సభల్లో నడ్డా పాల్గొన్నారు. మే5న మహబూబ్ నగర్ లో, ఆగస్ట్27న వరంగల్ లో, డిసెంబర్ 17న కరీంనగర్ సభల్లో నడ్డా.. పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. 

బండి దూకుడు
తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ ఈయేడాది  రాష్ట్ర బీజేపీ చరిత్రలో ఎన్నడూ లేనిరీతిలో సభలు, సమావేశాలు నిర్వహించి రికార్డు సృష్టించారు. బండి సంజయ్ ఈ యేడాది నాలుగు విడతల్లో ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించారు. మొదటి విడత పాదయాత్రను గత యేడాది పూర్తి చేశారు. ఈ యేడాది మొదట్లో ఆలంపూర్ జోగులాంబ నుంచి మహేశ్వరం వరకు రెండో విడత పాదయాత్ర చేశారు.భువనగిరి యాదాద్రి నుంచి హన్మకొండ వరకు మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగించారు. కుత్బుల్లాపూర్ నుంచి అబ్దూల్లాపూర్ మెట్ వరకు నాలుగో విడత పాదయాత్ర చేశారు. ఇటీవల భైంసా నుంచి కరీంనగర్ వరకు ఐదో విడత పాదయాత్ర పూర్తి చేశారు బండి సంజయ్.

ఇరకాటంలో కూడా..
నిస్తేజంగా ఉన్న నల్లగొండ బీజేపీ క్యాడర్ ను మునుగోడ ఉప ఎన్నికతో నిద్రలేచింది. రాజగోపాల్ రెడ్డి బీజేపీ లో చేరికతో బీజేపీలో జోష్ పెంచింది. ఉప ఎన్నిక ఓటమితో బీజేపీ కొంత ఢీలా పడినప్పటికీ... ఓట్ల శాతం పెరిగిందని సరిపెట్టుకుంది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశం బీజేపీని కొంత కలవరపాటుకు గురిచేసింది. బీజేపీ అగ్రనేతల పేర్లను ప్రస్తావించడం.. కేసులు పెట్టడం సిట్ వేయడం బీజేపీని ఇరకాటంలో పడేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బీజేపీ పేరు ప్రస్తావించడంతో.. తమ పార్టీకి సంబంధం లేదని యాదాద్రి లక్ష్మీనరసింహుడి సాక్షిగా తడి బట్టలతో బండి సంజయ్ ప్రమాణం చేశారు.

చేరికల పర్వం.. 
బీజేపీలో జాయినింగ్స్ సంబంధించి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నేతృత్వంలో కమిటీ వేశారు. బీజేపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ యేడాది మునుగోడు రాజగోపాల్ రెడ్డితో పాటు భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జిట్టా బాలాకృష్ణారెడ్డి, రామారావు పటేల్, ఎర్రవల్లి ప్రదీప్ రావు, రిటైర్డ్ ఐపీఎస్ కృష్ణప్రసాద్, రిటైర్డ్ ఐఏఎస్ రామచంద్రనాయక్, న్యాయవాది రచనరెడ్డి తదితరులు జాయిన్ కాగా.. స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్, భిక్షమయ్యగౌడ్ పార్టీని వదిలి వెళ్లారు. మొత్తానికి ఈ యేడాది మొత్తం వచ్చే ఎన్నికల ప్రిపరేషన్ లో  కాషాయ శ్రేణులు పనిచేశాయని చెప్పవచ్చు.

::: సాక్షి ప్రత్యేకం

Read latest Sakshi Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top