పాపం.. ఏడాది వయసుకే అమ్మ ఒడిని వీడిన బువా.. 32 ఏళ్లుగా ఒంటరిగా!

Thailand World Saddest Gorilla Bua Noi Heart Breaking Story - Sakshi

డబ్బు మనిషిని ఎంతకైనా దిగజారస్తుందనడానికి ఇది మరో ఉదాహరణ. ఏడాది వయసులో బాగా నమ్మిన వ్యక్తి చెయ్యి పట్టి గెంతులేసుకుంటూ దేశాలు దాటింది ఆ చిట్టి గొరిల్లా. పాపం.. తన జీవితం మూడు దశాబ్దాలపైగా నరకం లాంటి చోట చిక్కుకుపోతుందని ఊహించి ఉంటే అమ్మ ఒడిని అప్పుడు అది వీడి ఉండేది కాదేమో!.

బువా నోయి.. దీనికి అర్థం చిట్టి తామర అని. అయితే పేరులో ఉన్న ఆహ్లాదం.. ఆ గొరిల్లా ముఖంలో ఏమాత్రం కనిపించదు. దాని వయసు 33 ఏళ్లు. కానీ, 32 ఏళ్లుగా కంపు కొట్టే తుప్పు పట్టిన బొనులో బంధీగా ఉండిపోయింది. అందుకేనేమో ప్రపంచంలోనే అత్యంత బాధను అనుభవిస్తున్న గొరిల్లాకు దీనికంటూ ఒక ముద్ర పడిపోయింది. థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాంగ్‌ బంగ్‌ ఫ్లాత్‌లో బాంగ్‌ కీ ఖాన్‌ వద్ద ఓ ప్రైవేట్‌ మర్షియల్‌ బిల్డింగ్‌ పైన ‘పటా’ అనే జూ ఉంది. ఈ జూకి ప్రధాన ఆకర్షణ మాత్రమే కాదు.. అత్యంత వివాదాస్పదమైన అంశంగా మారింది బువా నోయి.

   

బువా Bua Noi పుట్టింది జర్మనీలో. ఏడాది వయసున్న బువాను దాని సంరక్షకుడు 7 లక్షల పౌండ్లకు థాయ్‌లాండ్‌ పటా జూ నిర్వాహకులకు అమ్మేశాడు. 1990లో అది అమ్మకి దూరమై.. ఈ జూలో అడుగుపెట్టింది. అప్పటి నుంచి అది బయటకు వచ్చింది లేదు. అక్కడే తిండి.. అక్కడే నిద్ర. అదే బోనులో ఒంటరిగా మిగిలిపోయింది. ఆ జూకి ప్రధాన ఆకర్షణగా మారిపోయింది. అయితే ఒంటరిగా అది పడుతున్న అవస్థను చూడలేక.. 2015 నుంచి కొందరు ఉద్యమకారులు దానిని బయటకు రప్పించేందుకు యత్నిస్తున్నారు. అయితే.. కొన్నదానికంటే కాస్త ఎక్కువ డబ్బు చెల్లిస్తేనే.. దానిని వదులుతానంటూ భీష్మించుకు కూర్చున్నాడు పటా జూ ఓనర్‌. దీంతో దీని విడుదలకు పెద్ద ఎత్తున్న ఉద్యమం మొదలైంది. 

థాయ్‌ పాప్‌ సింగర్‌ చెర్‌ సైతం దీనికి బయటకు రప్పించేందుకు చాలా యత్నించాడు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది.  అగ్రిమెంట్‌ బలంగా ఉండడంతో.. అక్కడి ప్రభుత్వం సైతం ఎలాంటి బలవంతపు చర్యలకు దిగలేకపోయింది. చివరకు ఫండ్‌ రైజింగ్‌ ద్వారా అనుకున్న సొమ్ము సేకరణకు దిగినా.. ఫలితం దక్కలేదు. అగ్రిమెంట్‌లో ఉన్న లొసుగులతో ఎప్పటికప్పుడు దానిని అమ్మే ధర పెంచుకుంటూ పోతున్నాడు ఆ ఓనర్‌. ఇది దాని స్వేచ్ఛకు అడ్డుతగులుతోంది.

దీంతో దానికి మరణం ద్వారా అయినా విముక్తి అందించాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికే అక్కడి కోర్టులో కొందరు అందుకు సంబంధించి పిటిషన్‌లు సైతం దాఖలు చేస్తున్నారు. బంధీగా అలా అది చావడం కంటే.. దానిని అక్కడే చంపేసేందుకు ప్రభుత్వం చర్యలు పూనుకోవాలని, అందుకు ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌ ద్వారా అభ్యర్థించారు.  మరోవైపు ఈ విషయం తమదాకా రావడంతో పెటా ఏషియా స్పందించింది. దాని బతుకు మరీ ఘోరంగా ఉందని.. పటా జూను మొత్తానికే సీల్‌ చేసి అక్కడి జంతువులకు విముక్తి కల్పించేందుకు పోరాటానికి సిద్ధమని ప్రకటించింది.

Read latest Sakshi Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top