రామయ్య!.. ఆ అవతారంతో పాటే నడిసంద్రంలో మునిగిపోయాడా? | Sakshi
Sakshi News home page

శ్రీ రామం.. ప్రత్యేకం: ఆ అవతారంతో పాటే రామయ్య నడిసంద్రంలో మునిగాడా?

Published Sat, Apr 9 2022 1:33 PM

South Indian Unique Rama Temples History Prominent Full Details - Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌: రాముని పాదాల దగ్గర ఆయన పరమ భక్తుడు శ్రీ ఆంజనేయుడు కచ్చితంగా ఉండాల్సిందే!.  అలాంటిది ఆ ఆలయంలో మాత్రం ఉండడు!. తెలంగాణ మెదక్‌ జిల్లా గుమ్మడిదలలోని శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయంలో స్వామివారిని ‘కళ్యాణ రాముడ’ని పిలుస్తారు. సీతారామకళ్యాణ ఘట్టం సమయానికి.. శ్రీ రామాంజనేయులకు పరిచయం లేదు. కాబట్టే ఇక్కడ మారుతి విగ్రహాన్ని ఏర్పాటుచేసి ఉండకపోవచ్చనీ ఆలయ వర్గాలు చెప్తున్నాయి.

వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆలయం ఇది. 45 ఏళ్ల కిందట ఆలయాన్ని పునరుద్ధరించారు. సీతాసమేతుడైన శ్రీరామునితోపాటు లక్ష్మణుడు- ఊర్మిళ, భరతుడు-మాండవి, శత్రుఘ్నుడు-శ్రుతకీర్తిల విగ్రహాలు గర్భగుడిలో కనిపించడం ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత. ఇక్కడ శ్రీరాముడు మీసాలతో కనిపిస్తుంటాడు. అందుకే ఇలాంటి అరుదైన దర్శనం మరెక్కడా దొరకదు.

 
--------
► తమిళనాడులోని అతిపెద్ద రామాలయాల్లో ఒకటి తిరువణ్ణమలై జిల్లాలోని నెడుంగుణమ్‌ శ్రీ రామ టెంపుల్‌. ఈ గుడిలో రాములోరి చేతిలో బాణం ఉండదు. గుండెపై కుడి చేయి వేసుకుని యోగముద్రతో శాంతమూర్తిగా కనిపిస్తాడు ఇక్కడ.  ప్రశాంతతకు నెలవుగా ఈ ఆలయాన్ని భావిస్తారు భక్తులు.  హనుమంతుడి విగ్రహం శిష్యుడి స్థానంలో వేదాధ్యయనం చేస్తూనే..  స్వామి చెబుతున్నది వింటున్నట్లు కనిపిస్తుంది. లక్ష్మణుడు మాత్రం విల్లు ధరించి ఉంటాడు. ఇక సీతమ్మ కుడిచేతితో తామరపువ్వు పట్టుకొని, ఎడమచేతిని రాముని పాదాలవైపు చూపిస్తున్నట్లు ఉంటుంది. 

రావణ సంహారం తరువాత శ్రీరాముడు ఇక్కడ విడిది చేశాడని, శుక మహర్షిని దర్శించుకున్నాడని స్థలపురాణాలు చెబుతున్నాయి. విజయం సాధించి తిరిగి వచ్చిన వాడు కాబట్టి ఇక్కడి రాముడిని ‘విజయ రాఘవన్‌’ అని అంటారు.  రాముడు యోగముద్రతో కనిపించే ఆలయాలు ఇంకా ఉన్నప్పటికీ.. వాటిల్లో బాగా పేరున్నది ఇదే. 

--------

► సాధారణంగా సీతారాముల విగ్రహంలో సీతమ్మ రాముడికి ఎడమ వైపు ఉంటుంది. కానీ, తిరుపతి కోదండ రామాలయంలో మాత్రం కుడివైపున సీతమ్మ విగ్రహం, ఎడమవైపున లక్ష్మణుడి విగ్రహం ఉంటుంది. వైఖానస ఆగమ నియమాల ప్రకారం అమ్మవారు దక్షిణంగా ఉండాలట!. ఆ ప్రకారమే ఈ విగ్రహం కుడివైపు ఏర్పాటు చేయించినట్లు పండితులు చెబుతున్నారు.  ఇలా ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం.

తిరుపతి సిటీ సెంటర్‌లో ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. రావణ సంహారం తరువాత అయోధ్యకు వెళ్తూ, ఈ ప్రాంతంలో శ్రీరాముడు విశ్రమించాడని స్థల పురాణం. అంతేకాదు సీతను అన్వేషించే క్రమంలో ఇక్కడి పుష్కరిణిలో స్నానం చేసినట్లు భవిష్యోత్తర పురాణంలో ఉంది.

--------

► త్రిప్రాయర్‌ శ్రీ రామస్వామి టెంపుల్‌..  కేరళలోని త్రిస్సూర్‌లో తీవ్ర నది ఒడ్డున ఉంది. ఎక్కడా కనిపించనట్లుగా ఆ గుడిలో శ్రీరాముడు.. విష్ణుమూర్తి అవతారంతో కనిపిస్తాడు. ‘త్రిప్రా దేవర్‌’గా ప్రసిద్ధుడైన ఈ శ్రీరాముడికి నాలుగు భుజాలు ఉంటాయి.  ఒక చేతిలో పాంచజన్యం (శంఖం), మరో చేతిలో సుదర్శన చక్రం, ఇంకో చేతిలో విల్లు, నాలుగో చేతిలో జపమాల ఉంటాయి.  వీటిలో జపమాల బ్రహ్మకు సంకేతంగా భావిస్తారు. అలాగే శివుడికి సంబంధించిన లక్షణాలు కొన్ని కనిపిస్తాయి. అందుకే త్రిమూర్తుల స్వరూపమైన ఆలయంగా త్రిప్రాయర్‌ని భావిస్తారు.  

ఈ ఆలయంలోని శ్రీరామ విగ్రహాన్ని ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పూజించాడనీ, అవతారం ముగిశాక ద్వారకతో పాటు ఈ విగ్రహం కూడా సముద్రంలో మునిగిపోయిందనీ స్థల పురాణం చెబుతోంది. సముద్రంలో దొరికిన విగ్రహానికి మత్స్యకారులు ప్రతిష్ఠ జరిపారని చెప్తారు. 

--------
ఫొటోల్లో తప్పించి శ్రీరామ పట్టాభిషేకం తరహా విగ్రహాలు ఏ ఆలయంలో కనిపించవు.. ఒక్క తమిళనాడులో తప్ప. సేలంకు దగ్గర్లోని అయోధ్యాపట్నంలోని శ్రీ కోదండపాణి రామాలయం ఉంది. ఇక్కడి ఆలయంలో రాముడు పట్టాభిషేక భంగిమలో కనిపిస్తాడు.  ఎడమ కాలిని కుడి తొడ మీద వేసుకొని దర్శనమిస్తాడు. ఎడమవైపు సీతాదేవి కూర్చొని ఉంటుంది. దీని వెనక ఒక పురాణ గాథ ఉంది.

రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతా, సైన్యం సమేతంగా ఈ ప్రాంతానికి వచ్చాడట. అయోధ్య పట్టాభిషేక ముహూర్తం ఆలస్యం అవుతుండడంతో.. ఈ ప్రాంతంలో పట్టాభిషేకం జరిపారని స్థల పురాణం చెబుతోంది. అందుకే ఈ ఊరికి అయోధ్యపట్నం అని పేరొచ్చిందని భావిస్తుంటారు.

::శ్రీరామ నవమి సందర్భంగా..

Advertisement
 
Advertisement
 
Advertisement