గుజరాత్‌ ఎన్నికల చిత్రం.. పటేళ్ల రూటు ఎటు?

Patidars And Patels Key Role In Gujarat Assembly Elections - Sakshi

గుజరాత్‌లో ఎన్నికలంటే చాలు అందరి దృష్టినీ ఆకర్షించే వర్గం పాటీదార్లు. పటేళ్ల ఆగ్రహం, అనుగ్రహాలపైనే రాష్ట్రంలో అధికారం ఆధారపడి ఉంటుంది. అందుకే అన్ని పార్టీలు వీరి మద్దతు కోసం కష్టపడతాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కమలనాథులను భయపెట్టింది ఈ పటేళ్లే. మరి ఈసారి పటేళ్ల దారెటు..?

పాటిదార్లే పవర్‌ ఫుల్‌
గుజరాత్ జనాభాలో పాటీదార్ల సంఖ్య సుమారు 15 శాతం. వ్యవసాయం నుంచి వ్యాపారవాణిజ్యాల వరకూ  అన్ని రంగాల్లో బలంగా పాతుకుపోయారు. సౌరాష్ట్ర ప్రాంతంలోని రాజ్కోట్, అమ్రేలి, మోర్బీ జిల్లాలతోపాటు ఆనంద్‌, ఖేడా, మెహ్సనా, పటాన్, అహ్మదాబాదుల్లో పటేళ్ల ప్రాబల్యం ఎక్కువ. 182 సీట్ల అసెంబ్లీలో 50 చోట్ల వీరి ఓట్లు అత్యంత కీలకం. ఈ 50 నియోజకవర్గాల్లో పాటీదార్ ఓట్లు 20 శాతం పైగా ఉన్నాయి. మరో 40 సీట్లను ప్రభావితం చేస్తారనేది పార్టీల అంచనా.! 

మద్ధతు నుంచి ఉద్యమం దాకా
1990 నుంచి పాటీదార్లు బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే పటేళ్ల ఉద్యమం ఈ పరిస్థితిని మార్చింది.  ఓబీసీల తరహాలో తమకూ విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కావాలంటూ ఆందోళనకు దిగారు పాటిదార్లు. 2007లోనే నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ సర్దార్ పటేల్ ఉత్కర్ష్ సమితిని ఏర్పాటుచేశారు. 2015లో హార్దిక్ పటేల్ సారథ్యంలో పటేళ్ల ఆందోళన ఉవ్వెత్తున ఎగసిపడింది. ఈ ఉద్యమాన్ని బీజేపీ ప్రభుత్వం అణచివేసింది. పోలీసు కాల్పుల్లో అనేకమంది పాటీదార్ యువకులు చనిపోయారు. దీంతో పటేళ్లు, బీజేపీ మధ్య దూరం పెరిగింది. 2017 ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఎప్పుడూ మూడంకెల సీట్లు దాటే బీజేపీ.. 99కే పరిమితమైంది. 

కమలం గూట్లో ఉద్యమనేత
2017లో జరిగిన తప్పులకు.. ఇప్పుడు బీజేపీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్ల రూపంలో పటేళ్లకు సాయం అందుతుందని బీజేపీ ప్రచారం చేస్తోంది. పటేల్ వర్గానికి చెందిన 45మందిని పోటీలో నిలబెట్టింది. మరీ ముఖ్యంగా.. 2015లో ఆందోళన చేసిన హార్దిక్ పటేల్‌ను పార్టీలో చేర్చుకుని సీటిచ్చింది. పటేళ్ల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు.. ఎన్నికలకు ఏడాది ముందు విజయ్ రూపానీను తప్పించి.. భూపేంద్ర పటేల్‌కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించింది. ఈ చర్యలన్నీ పాటీదార్లను తిరిగి తమవైపు మొగ్గు చూపేలా చేస్తాయనేది కమలనాథుల ఆశ. గుజరాత్‌లో బీజేపీ 150 సీట్ల టార్గెట్‌  చేరుకోవాలంటే పటేళ్ల మద్దతు తప్పనిసరి. 

చేయి కలుపుతారా? చేయిస్తారా? 
గుజరాత్‌లో క్షత్రియ, హరిజన్, ఆదివాసీ, ముస్లిం ఓట్లపై ఆధారపడిన కాంగ్రెస్‌కు.. 2017 ఎన్నికల్లో పాటిదార్ల అండ దొరికింది. అందుకే ఏకంగా 77 సీట్లు సాధించగలిగింది. ఈసారి అదే కొనసాగుతుందని ఆశిస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు హార్దిక్‌ పటేల్‌ బీజేపీలోకి వెళ్లిపోవడం కాంగ్రెస్ పెద్ద దెబ్బ. కాంగ్రెస్ నాయకత్వం, రాహుల్ గాంధీపై హార్దిక్‌ చేసిన విమర్శలు.. హస్తం పార్టీని డిఫెన్స్‌లో పడేశాయి. అయినా పాటిదార్ ఓట్ల కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది కాంగ్రెస్‌.

42మంది పటేళ్లకు సీట్లు ఇచ్చింది. తొలిసారి గుజరాత్‌ను ఊడ్చేయాలని ఉవ్విళ్లూరుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పాటీదార్లను బుట్టలో వేసుకోవటానికి గట్టిగానే యత్నిస్తోంది. అందుకే బీజేపీ, కాంగ్రెస్‌ కంటే ఎక్కువగా పటేళ్లకు సీట్లిచ్చింది. 46 మంది పాటీదార్లను అసెంబ్లీ బరిలోకి దించింది ఆప్‌. వీరిలో 2015 నాటి ఉద్యమ నాయకులు ఎక్కువగా ఉన్నారు. మరి పటేళ్ల మొగ్గు ఎటువైపో తెలియాలంటే, డిసెంబర్ 8 వరకూ ఆగాల్సిందే.
పొలిటికల్‌ ఎడిటర్‌, సాక్షి డిజిటల్‌
feedback@sakshi.com

Read latest Sakshi Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top