దేశంలో అత్యంత నెమ్మెదిగా నడిచే రైలు ఇదే.. అయినా ‘యూనెస్కో’ గుర్తింపు

Mettupalayam Ooty Nilgiri Passenger Train Is Slowest Train In India - Sakshi

చెన్నై: ఒక రైలు తన ప్రయాణం మొదలు పెట్టిందంటే.. అది గమ్యం చేరేందుకు గరిష్ఠ వేగంతో దూసుకెళ్తుంది. వందే భారత్‌, రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌, దురంతో ఎక్స్‌ప్రెస్‌ వంటి రైళ్లు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయని తెలుసు. కానీ, దేశంలో అత్యంత నెమ్మదిగా నడిచే రైలు ఏదో తెలుసా? అసలు అలాంటి ఓ ట్రైన్‌ ఉంటుందని ఊహించారా? అవునండీ నిజమే ఉంది. అది కేవలం గంటకు 10 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణిస్తుంది. కానీ, అది యునెస్కో వారసత్వ సంపద జాబితాలో చోటు సంపాదించింది. అదే తమిళనాడులోని ‘మెట్టుపాలయం ఊటీ నీలగిరి ప్యాసెంజర్‌ ట్రైన్‌’. ఈ ట్రైన్‌ ప్రత్యేకతలు ఓసారి తెలుసుకుందాం. 

భారత్‌లో అత్యంత నెమ్మెదిగా నడిచే ట్రైన్‌గా ఈ రైలు ప్రసిద్ధిగాంచింది. అత్యంత వేగంగా నడిచే రైలుతో పోలిస్తే.. ఇది 16 రెట్లు నెమ్మదిగా వెళ్తుందంటే నమ్మశక్యం కాదు. ఐదు గంటల్లో కేవలం 46 కిలోమీటర్లు ప్రయాణించి గమ్యం చేరుకుంటుంది. అయితే, అందుకు ప్రధాన కారణం అది కొండ ప్రాంతంలో నడవటమే. ఐక్యరాజ్య సమితి విభాగం యునెస్కో ఈ రైలును ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. యునెస్కో ప్రకారం.. నీలగిరి మౌంటెయిన్‌ రైల్వే లైన్‌ నిర్మాణం కోసం 1854లో తొలుత ప్రతిపాదన చేశారు. కానీ, కొండల్లో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులతో వాయిదా పడుతూ వచ్చింది. చివరకు 1891లో పనులు ప్రారంభం కాగా.. 1908లో పూర్తయ్యాయి. 

ఆహ్లాదానిచ్చే రైడ్‌.. 
ఐఆర్‌టీసీ ప్రకారం.. ఈ రైలు చాలా సొరంగాల గుండా ప్రయాణిస్తుంది. 46 కిలోమీటర్ల ప్రయాణంలో 100కుపైగా వంతెనలను దాటుతుంది. పెద్ద పెద్ద రాళ్లు, లోయలు, తేయాకు తోటలు, పచ్చని కొండల అందాలు ఆహ్లాదానిస్తాయి. మెట్టుపాలయం నుంచి కూనూర్‌ మధ్య సుందరమైన దృశ్యాలు కనిపిస్తాయి. 

ప్రధాన స్టేషన్లు.. 
నీలగిరి మౌంటెయిన్‌ రైల్వే ప్రతిరోజు మెట్టుపాలయం నుంచి ఊటీ వరకు సేవలందిస్తుంది. రోజు ఉదయం 7.10 గంటలకు ఈ రైలు మెట్టుపాలయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు ఊటీకి చేరుకుంటుంది. తిరిగి ఊటీలో 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.35 గంటలకు మెట్టుపాలయంకు చేరుకుంటుంది. ఈ రూట్‌లో ప్రధానంగా కూనూర్‌, వెల్లింగ్టన్‌, అరవన్‌కుడు, కెట్టి, లవ్‌డేల్‌ వంటి స్టేషన్లు వస్తాయి. 

ఈ రైలులో ఫస్ట్‌ క్లాస్‌, సెకండ్‌ క్లాస్‌ అని రెండు రకాల కంపార్ట్‌మెంట్లు ఉంటాయి. ఫస్ట్‌ క్లాస్‌లో తక్కువ సంఖ్యలో సీట్లు ఉంటాయి. డిమాండ్‌ పెరిగిన క్రమంలో 2016లో నాలుగో బోగీని జత చేసింది రైల్వే శాఖ. 

టికెట్లు ఎలా బుక్‌ చేసుకోవాలి?
నీలగిరి మౌంటెయిన్‌ రైల్వేలో ప్రయాణించేందుకు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. హాలీడేస్‌, వీకెండ్‌లో పర్యటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.

ఇదీ చదవండి: ఏనుగుతో ఫోటోకు కొత్త జంట పోజు.. చిర్రెత్తి కుమ్మిపడేసిందిగా!

Read latest Sakshi Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top