సీఎం జగన్‌ విజయమిది.. | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ విజయమిది..

Published Wed, Feb 15 2023 9:29 PM

Hitaishi Comments On Cm YS Jagan And Kadapa Steel Plant - Sakshi

ఒకప్పుడు విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆ తర్వాత కానీ.. విశాఖలో ఉక్కు ప్యాక్టరీ ఏర్పాటు కాలేదు. ఇప్పుడు ఎలాంటి నిరసనలు అవసరం లేకుండానే  ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలో వైఎస్సార్‌ జిల్లా జమ్మల మడుగు నియోజకవర్గం సున్నపురాళ్ల పల్లె వద్ద ఉక్కు కర్మాగారానికి బీజం పడింది.

ఇది నిజంగా రాయలసీమ ప్రాంత వాసులే కాకుండా మొత్తం విభజిత ఏపీ ప్రజలంతా సంతోషించాల్సిన సమయం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న చొరవను ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ గొప్పగా ప్రశంసించారు. ఆంధ్రలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలను కూడా ఆయన మెచ్చుకున్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. 8,800 కోట్ల వ్యయంతో ఈ స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని, భవిష్యత్తులో ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ స్టీల్ ప్లాంట్‌గా రూపొందించడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని ఆయన ప్రకటించారు. 

ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడానికి ప్రభుత్వం కూడా 700 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తోందని తెలిపారు. ఒకవైపు కొప్పర్తి ఎలక్ట్రానిక్ పారిశ్రామికవాడ, మరో వైపు స్టీల్ ప్లాంట్ సిద్దమైతే ఈ జిల్లా ముఖ చిత్రం మారిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మామూలుగా అయితే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చుతుందా? లేదా? అన్న సందేహం ఉండేది. ఈసారి స్టీల్ ప్లాంట్లను నిర్వహిస్తున్న జిందాలే దీనిని టేకప్ చేయడం , భూమి పూజ పూర్తి చేయడం, తన ప్రణాళికను వెల్లడించడంతో నమ్మకం పెరుగుతుంది. 

ఆయన ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్రల్లో భారీ స్టీల్ కర్మాగారాలను నడుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన వ్యక్తి. ఈ రంగంలో ఆయనో దిగ్గజం. అందువల్ల ఈ ప్లాంట్ వచ్చే రెండు, మూడేళ్లలో ఒక రూపానికి వస్తుందన్న విశ్వాసం వ్యక్తమవుతోంది. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లుతున్న తీరు మరి కొద్దినెలల్లోనే క్షేత్ర స్థాయిలో అర్ధం అవుతుంది కూడా.. నిజమే! పదిహేనేళ్ల క్రితమే ఈ ఉక్కు ఫ్యాక్టరీ ఊపిరి పోసుకుని ఉండవలసింది. వివిధ కారణాల వల్ల అది సాధ్యపడలేదు. 

ఇదే ప్రాంతంలో కర్నాటకకు చెందిన మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డి ఉక్కు ప్యాక్టరీ పెట్టడానికి ముందుకు వచ్చారు. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన ఇందుకోసం సుమారు రెండువేల ఎకరాల భూమి సేకరణ  చేశారు. నిర్వాహకుల లోపాలతో పాటు తెలుగుదేశానికి చెందిన వారు, ఆ పార్టీకి సంబంధించిన మీడియా వారు  పలు అడ్డంకులు  సృష్టించారు. బల్లులు కూడా గుడ్లు పెట్టని స్థలాన్ని ఇందుకోసం ఎంపిక చేస్తే టీడీపీ మీడియా ఆనాడు ఏమని వార్తా కథనాలు రాసిందో తెలుసా!. 

అక్కడ సెలయేర్లు, జలపాతాలు ఉన్నాయని, జింకలు, లేళ్లు చెంగు చెంగున గంతులు వేస్తుంటాయని, పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని అబద్దపు కథనాలు ఇచ్చారు. అయినా ప్రాజెక్టు ముందుకు వెళ్లి ఉండేదేమో. కానీ.. దురదృష్టవశాత్తు వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్యంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడంతో అది వెనుకపడిపోయింది. ఇక్కడ మరో సంగతి కూడా ప్రస్తావించాలి. వైఎస్సార్‌ మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలలో ఆయన కుమారుడు సీఎం వైఎస్‌ జగన్ కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీ పెట్టుకోవడం, దాంతో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం జగన్‌పై సీబీఐ కేసులు పెట్టి జైలుపాలు చేయడం వంటివి కూడా ఏపీకి తీరని నష్టం చేశాయి.

అప్పట్లో సోనియాగాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వారి చేతిలో పనిముట్టుగా మారిన సీబీఐ అధికారి ఒకరు కలిసి రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేశారు. పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వచ్చినవారిని ఏదో ఒక సాకు చూపి జైలులో పెట్టించారు. ఒకవైపు పరిశ్రమలు స్థాపిస్తామని బ్యాంకుల వద్ద వేల కోట్ల రూపాయల రుణాలు పొందిన కొందరు రాజకీయ ప్రముఖులు ఆయా జాతీయ పార్టీలలో సేఫ్‌గా ఉండగా, పరిశ్రమలు పెడుతున్నవారు నానా ఇక్కట్లు పడవలసి వచ్చింది. 

దానికి తోడు తెలంగాణ ఉద్యమ ప్రభావం  ఉండనే ఉంది. దీంతో ఏపీలో పరిశ్రమలు పెట్టాలంటేనే భయపడేలా చేశారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. విభజన చట్టంలో కడప స్టీల్ ప్లాంట్ పై అధ్యయనం చేయాలని ఒక క్లాజ్ పెట్టారు. దాని ప్రకారం కేంద్రం చర్యలు తీసుకోవలసి ఉండగా, ఆయా కారణాలతో కేంద్రం చొరవ తీసుకోలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మిత్ర పక్షంగా ఉన్న తెలుగుదేశం ఏపీలో అప్పట్లో అధికారంలో ఉంది. 

కానీ.. వారు కూడా ప్రత్యేక శ్రద్ద పెట్టలేకపోయారు. దీనిపై ప్రజలలో వ్యతిరేకత వస్తోందని శంకించిన టీడీపీ ప్రభుత్వం 2018లో అంటే ఎన్నికల ముందు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన అంటూ హడావుడి చేసింది. దానికి ముందుగా రాజ్యసభ సభ్యుడు సీ.ఎమ్‌. రమేష్ నిరాహార దీక్ష డ్రామా కూడా జరిగింది. అదేదో కర్మాగారం వచ్చేసినంత హడావుడి చేశారు. అదంతా ఉత్తుత్తిదే అన్న సంగతి ప్రజలకు అర్ధం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు.

2019లో టీడీపీ ఓడిపోయి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే ముఖ్యమంత్రి జగన్ ఏపీ ప్రభుత్వమే దీని ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని భావించి శంకుస్థాపన చేశారు. ఇందుకోసం భాగస్వామిని ఎంపిక చేసే యత్నం జరిగింది. ఇంతలో కరోనా సమస్య అతలాకుతలం చేయడంతో రెండేళ్లపాటు ఇది ఆలస్యం అయింది. అయినా సీఎం జగన్ దీనిని వదలిపెట్టలేదు. పట్టువదలని విక్రమార్కుడి మాదిరి ఈ రంగంలో అనుభవజ్ఞులతో సంప్రదింపులూ జరిపి, వారిని ఒప్పించడానికి ప్రయత్నించారు. ఎట్టకేలకు ఆ కృషి ఫలించి ఇప్పుడు అది కార్యరూపం దాల్చుతోంది. ఈ ప్లాంట్ సజావుగా పూర్తి అయి, వేలాది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా ఏపీ పారిశ్రామిక చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాందీ పలుకుతుందని ఆశిద్దాం.
- హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. 

Advertisement
 
Advertisement