
మీ పిల్లలు ఫోన్లలో లేదా రీల్స్‌లో మునిగిపోయినప్పుడు.. ఈ స్మార్ట్ ఫోన్ అన్నదే లేకుంటే బాగుణ్ను.. వీళ్లు బాగుపడేవాళ్లు అని అనుకున్నారా? లేదా మా కాలంలో ఇలాంటి అడిక్షన్లు ఉండేవి కావు.. చక్కగా బయట ఆడుకునేవాళ్లం అని క్లాసులు పీకారా?
అలాగే మీ పిల్లలు ఎదిగే క్రమంలో సోషల్ మీడియా కావొచ్చు.. వీడియో గేమ్స్ కావచ్చు.. ఇవన్నీ వాళ్ల భవిష్యత్తుకు ప్రతిబంధకాలు అని అనుకుంటున్నారా? చాలామంది అనుకునే ఉంటారు.. మనమే కాదు.. అమెరికాలోనూ ఇదే పరిస్థితి.. ఇటీవల అమెరికాలో ఓ సర్వే జరిగింది. అందులో 18 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న పిల్లలు కలిగిన తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీ పిల్లల ఎదుగుదల లేదా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నప్పుడు.. వీటిని కనిపెట్టకుండా ఉంటే బాగుణ్ను అని వేటి గురించి అనుకున్నారు అని ప్రశ్నించారు. ఎక్కువ మంది ఆన్‌లైన్లోని అడల్ట్ కంటెంట్ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతకీ వారేమన్నారంటే..

ప్రత్యేకంగా ఒక్కొక్కటిగా ప్రశ్నించినప్పుడు టిక్‌టాక్ కనిపెట్టకుండా ఉంటే బాగుణ్ను అని సర్వేలో పాల్గొన్న వారిలో 62 శాతం మంది అన్నారు. ఇంతే శాతం మంది ‘ఎక్స్’(ట్విట్టర్) విషయంలోనూ చెప్పారు. ఇన్‌స్ట్రాగాం లేకుండా ఉంటే బాగుండేదని 56 శాతం మంది అన్నారు. ఆధారం: ది హారిస్ పోల్–మార్కెట్ రీసెర్చ్ కంపెనీ..
– సాక్షి సెంట్రల్ డెస్క్