పహాడీషరీఫ్: వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులతో తుక్కుగూడలో పెద్ద ఎత్తున కొనసాగుతున్న ప్రైవేట్ హాస్టళ్లలో పహాడీషరీఫ్ పోలీసులు శనివారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇన్స్పెక్టర్ బి.లక్ష్మీనారాయణ రెడ్డి పర్యవేక్షణలో 100కు పైగా ఉన్న హాస్టళ్లలో ఎస్ఐలు బి.దయాకర్ రెడ్డి, వి.లక్ష్మయ్య, ఎల్.వెంకటేశ్వర్లు, ఫైజల్ అహ్మద్, నర్సింహులు సిబ్బందితో బృందాలుగా ఏర్పడి పరిస్థితులను సమీక్షించారు. హాస్టళ్లలో నివాసం ఉంటున్న వారికి సంబంధించిన పోలీస్ ఎన్వోసీ, వెరిఫికేషన్ ఫారాలు, సీసీ టీవీల పుటేజీ, భవనాలకు సంబంధించిన ట్రేడ్ లైసెన్స్, ఫైర్ ఎన్వోసీ, ఉద్యోగులు ఏ రాష్ట్రానికి చెందిన వారు, ఏ కంపెనీలో పని చేస్తున్నారనే విషయమై పూర్తి నివేదికను నిర్వాహకులు పోలీసులకు అందించాలన్నారు. గుర్తింపు లేకుండా ఉంటున్న వారిపై కేసులు నమోదు చేస్తామని, సీసీ కెమెరాలు లేకుండా, సరైన ధ్రువీకరణ పత్రాలు చూపని హాస్టళ్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా విద్యార్థినులు, మహిళా ఉద్యోగులు అద్దెకుంటున్న హాస్టళ్లలో లేడీ వార్డెన్ మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలతో నేరాలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఇన్స్పెక్టర్ వెల్లడించారు.


