మొయినాబాద్: గుర్తుతెలియని దుండగుడు ఏటీఎం సెంటర్లలో చోరీకి విఫలయత్నం చేశాడు. ఈ సంఘటన మున్సిపల్ కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ కేంద్రంలో హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి పక్కన ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలు పక్కపక్కనే ఉన్నాయి. శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో గుర్తుతెలియని దుండగుడు మాస్క్ ధరించి ఏటీఎంల వద్దకు వచ్చాడు. అక్కడ ఉన్న సీసీ కెమరాలకు నల్లని స్ప్రే కొట్టి మొదట ఎస్బీఐ ఏటీఎంలోకి చొరబడ్డాడు. వైర్లు కత్తిరించి ఏటీఎంను తెరిచే ప్రయత్నం చేశాడు. అది తెరుచుకోకపోవడంతో పక్కనే ఉన్న యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలోకి వెళ్లాడు. అందూలోనూ ఏటీఎం వైర్లు కత్తరించి తెరిచే ప్రయత్నం చేశాడు. అది పూర్తిగా తెరుచుకోకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. శనివారం ఉదయం ఏటీఎంల పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు సీసీ కెమెరాలను పరిశీలించడంతో అందులో ఏమీ కనిపించలేదు. అనుమానం వచ్చి మరోవైపు ఉన్న సీసీ కెమరాను పరిశీలిస్తే గుర్తుతెలియని దుండగుడు ఏటీఎం సెంటర్లలో చోరీకి యత్నించినట్లు కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇన్స్పెక్టర్ మల్లికార్జునరెడ్డి, ఎస్ఐ వెంకన్న, క్రైం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డబ్బులు ఏమీ పోలేదని గుర్తించారు. క్లూస్టీంతో వేలిముద్రలు సేకరించారు. ఎస్బీఐ మేనేజర్ శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెరుచుకోకపోవడంతో వదిలేసి వెళ్లిన దుండగుడు


