సనత్‌నగర్‌లో ఎల్‌ఎస్‌డీ ముఠా గుట్టురట్టు
అధిక ధరలకు విక్రయిస్తున్నారు
వికారాబాద్‌లోని మహాలక్ష్మి ఏజెన్సీవారు డీఏపీని ఎక్కువ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఐదు బస్తాల డీఏపీ తీసుకోగా రూ.8,400 వసూలు చేశారు. డీలర్ మా వద్ద తీసుకున్న సొమ్ము రికవరీ చేయాలి. నగదు రూపేన ఇవ్వకుండా ఫోన్‌పే ద్వారా చెల్లించడం జరిగింది.
– రమేశ్‌నాయక్, రైతు
ఫిర్యాదు చేస్తే చర్యలు
అధిక ధరలకు విక్రయిస్తున్న డీలర్లపై ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. డీఏపీ బస్తాను రూ.1,350కే విక్రయించాలి. ఎవరైనా ఎక్కువ ధరకు విక్రయిస్తే రైతులు ఆధారాలతో ఫిర్యాదు చేయాలి.
– వెంకటేశం, ఏడీఏ వికారాబాద్
పెట్టుబడుల పేరుతో రూ.10 లక్షలు స్వాహా
ఇన్‌స్ట్రాగాం ద్వారా ఎర వేసి, నేరుగా కలిసి టోకరా
సాక్షి, సిటీబ్యూరో: అత్తాపూర్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగికి పెట్టుబడుల పేరుతో ఇన్‌స్ట్రా గాం ద్వారా ఎర వేసిన ఓ ముఠా నేరుగా కలిసి రూ.10 లక్షలు స్వాహా చేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితుడు గత ఏడాది సెప్టెంబర్‌లో తన సహోద్యోగి సయ్యద్ సర్ఫరాజ్ ద్వారా ఇన్‌స్ట్రాగాంలో వచ్చిన పెట్టుబడి ప్రకటనలు చూశారు. తమ స్కీముల్లో పెట్టుబడిపెడితే కేవలం 7–8 రోజుల్లోనే భారీ లాభాలు ఇస్తామని ఉండటంతో ఆకర్షితుడయ్యాడు. అందులో ఉన్న నెంబర్ ఆధారంగా బాధితుడు బతూల్ ఫాతిమా అలియాస్ సకీనా ఫాతిమాను సంప్రదించాడు. ఆమె సూచనల మేరకు అత్తాపూర్‌లోని ఓ హోటల్‌లో సమావేశానికి వెళ్లాడు. అక్కడ బతూల్ ఫాతిమా, అలీ జాన్ రజ్వీ తదితరులు తమ వద్ద రూ.10 లక్షలు పెట్టుబడిపెడితే వాటిని షేర్లలో ఇన్వెస్ట్ చేసి రెండు వారాల్లో రూ.18 లక్షలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీనికోసం ఏర్పాటు చేసిన ఓ వాట్సాప్ గ్రూప్‌లోనూ ఇతడిని చేర్చారు. బాధితుడు గత ఏడాది సెప్టెంబర్ 22, 23 తేదీల్లో వివిధ బ్యాంకు ఖాతాలు, వాలెట్ లావాదేవీల ద్వారా రూ.10 లక్షలు బతూల్ ఫాతిమా ఖాతాకు బదిలీ చేశాడు. దీనికి సంబంధించి ఆమె రసీదు ఇవ్వడంతో పాటు అదే ఏడాది అక్టోబర్ 7లోపు రూ.18 లక్షలు చెల్లిస్తామని ఒప్పందం కూడా చేసుకుంది. గడువు ముగిసినా డబ్బు తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేయడంతో బాధితుడు నిలదీయగా... అదే ఏడాది డిసెంబర్ 16న మరో ఒప్పందం చేసుకుంటూ... డిసెంబర్ 25లోపు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ష్యూరిటీగా ఖాళీ చెక్కులు కూడా బాధితుడికి అందించారు. ఆ గడువు ముగిసే సమయానికీ చెల్లించకపోవడంతో వారిని సంప్రదించడానికి ప్రయత్నించగా ఫోన్లు స్విచ్ ఆఫ్ అని తెలిసింది. నిందితులు తమ ఇళ్లు కూడా ఖాళీ చేసి పరారయ్యారని గుర్తించారు. దీంతో బాధితుడు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇదే పంథాలో నిందితులు అనేక మందిని మోసం చేసి సుమారు రూ.90 లక్షల నుంచి రూ.95 లక్షలు వసూలు చేసినట్లు తనకు తెలిసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రకృతి అందాలు.. పరవశించిన పర్యాటకులు
వికారాబాద్ జిల్లా ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడింది. స్నేహితుల దినోత్సవం సందర్భంగా అనంతగిరి హిల్స్, కోట్‌పల్లి ప్రాజెక్ట్‌కు యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. అడవులు, కొండల మధ్య దృశ్యాలను చూస్తూ పరవశించారు. ప్రాజెక్ట్ వద్ద బోటింగ్ చేస్తూ, సెల్ఫీలు దిగుతూ సందడిగా గడిపారు. – అనంతగిరి, ధారూరు
నాగోలు: గుర్తు తెలియని వ్యక్తులు హోల్‌సేల్ మార్కెట్ క్యాష్ కౌంటర్ పగలగొట్టి షాప్‌లో ఉన్న రూ.6.40 లక్షల నగదు చోరీ చేశారు. ఎల్‌బీనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్మన్‌ఘాట్‌కు చెందిన చిక్కొటి శివకుమార్ బైరామల్‌గూడ, అల్తాప్ నగర్‌లో శ్రీ భవానీ ట్రేడర్స్ పేరుతో హోల్‌సేల్ నూనె, బియ్యం వ్యాపారం నిర్వహిస్తున్నారు. శనివారం రూ.6.40 లక్షల నగదు క్యాష్ కౌంటర్‌లో పెట్టి షాప్ మూసి వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం షాప్ తెరిచి చూడగా క్యాష్ కౌంటర్ పగలగొట్టి ఉంది. క్యాష్ కౌంటర్‌ను తనిఖీ చేయగా నగదు చోరీకి గురైనట్లు నిర్ధారించుకున్నారు. దుండగులు షాప్‌లో ఉన్న సీసీటీవీ డీవీఆర్ పవర్ కేబుల్ తొలగించి కెమెరా యాంగిల్స్ మార్చి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. శివకుమార్ ఎల్‌బీనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సనత్‌నగర్: సనత్‌నగర్ పారిశ్రామికవాడ ప్రాంతంలో ఎల్‌ఎస్‌డీ (లైసెర్జిక్ యాసిడ్ డైఎథైలమైడ్) మత్తు పదార్ధాలను విక్రయిస్తున్న ముఠాను సనత్‌నగర్ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 45 ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సనత్‌నగర్‌లోని ఆర్‌ఎస్ బ్రదర్స్ గోదాం సమీపంలో ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్ విక్రయిస్తు బైక్‌పై వచ్చిన అర్లికట్టె రాజేష్ అనిరుధ్ అలియాస్ డింగీ (28), కొనుగోలుదారు కే మోహిత్ (27)లను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 45 ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్ (0.600 గ్రాములు) లభించాయి. విచారణలో ప్రధాన నిందితుడు ఆన్‌లైన్ ద్వారా విదేశీ వ్యక్తి నుంచి సింప్లెక్స్ యాప్ సహాయంతో ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్ తెప్పించుకుని వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు అంగీకరించాడు. మోహిత్ కూడా గత ఏడాదిగా అతని వద్ద నుంచి ఎల్‌ఎస్‌డీ కొనుగోలు చేసి వినియోగించడంతో పాటు ఇతరులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. ఈ మేరకు పోలీసులు ఎన్‌డీపీఎస్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


