ఫిర్యాదు చేసుకోండి
ధాన్యం
సొమ్ము
యాలాల: వరి ధాన్యం కొనుగోలు చెల్లింపుల డబ్బులు భారీ స్థాయిలో పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రైతుల ఖాతాల్లోకి జమ చేయాల్సిన నగదు ప్రైవేటు వ్యక్తి ఖాతాల్లోకి మళ్లింపు చేశారంటూ బాధిత రైతులు వాపోతున్నారు. బాధిత రైతులు తెలిపిన ప్రకారం.. వేసవిలో రాస్నం గ్రామంలో మండల మహిళా సమాఖ్య(ఐకేపీ)ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో జూన్‌లో గ్రామానికి చెందిన ఎం.కాశమ్మ(116 సంచులు), మొల్ల మన్నాన్(103 సంచులు), రైకల అజీం(78 సంచులు), ఎన్కెపల్లి మల్లప్ప(78 సంచులు), జుబేరా బేగం(38 సంచులు), ఫైమూద బేగం(32 సంచులు) విక్రయించారు. ఇందుకు సంబంధించిన నగదు నేటికి తమ ఖాతాల్లో జమకాకపోవడంతో ఆదివారం వారు ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్‌కు ఫోన్ చేశారు. దీంతో వెంటనే గ్రామానికి చెందిన అంజిలప్ప బాధిత రైతులకు ఫోన్ చేసి, ధాన్యం డబ్బులు తన ఖాతాలో పడ్డాయని.. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నానని.. సాయంత్రం చెల్లిస్తానని చెప్పాడు. దీంతో నగదు తమ ఖాతాలో కాకుండా మరో వ్యక్తి అకౌంట్‌లో జమ కావడంపై బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐకేపీ కొనుగోలు కేంద్రం అంజిలప్ప అన్ని తానై వ్యవహరిస్తూ పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడుతున్నాడని బాధిత రైతులు ఆరోపించారు. ధాన్యం విక్రయించే సమయంలో రైతులు తెలంగాణ గ్రామీణ బ్యాంకు, రాస్నం శాఖకు చెందిన తమ ఖాతా వివరాలను విక్రయపట్టిలో నమోదు చేసినప్పటికీ మరో వ్యక్తి ఖాతాలోకి ఎలా మల్లించారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు దృష్టి సారించి రాస్నం కొనుగోలు కేంద్రం నిర్వాహణలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి అక్రమాలను వెలికి తీయాలని డిమాండ్ చేస్తున్నారు.
రైతులు విక్రయించిన ధాన్యానికి సంబంధించిన సొమ్ము విక్రయదారుల ఖాతాకు బదులుగా ప్రైవేట్ వ్యక్తి అకౌంట్‌లో జమ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కర్షకులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
రాస్నం కొనుగోలు కేంద్రంలో అవకతవకలు!
అన్నదాత బదులు మరొకరి ఖాతాలో నగదు జమ
అధికారుల నిర్లక్ష్యమే కారణమని రైతుల ఆరోపణ
చర్యలకు డిమాండ్
కాగా ఈ విషయమై యాలాల ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్‌ను వివరణ కోరగా.. ఆదివారం కూడా ఇంటి వద్ద ఉండవద్దా.. రాస్నం కొనుగోలు కేంద్రంలో ధాన్యం డబ్బుల చెల్లింపుల విషయం నాకు ఏమీ తెలియదు.. ఎవరికై నా ఫిర్యాదు చేసుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.


