అనంతగిరి: మత్తు రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఎస్పీ స్నేహమెహ్ర అన్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్ల పరిధిలోని సమస్యాత్మక, ఏకాంత ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విద్యాసంస్థల పరిసర ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాల్లో శనివారం రాత్రి పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సమాజ, యువత భవిష్యత్‌కు ముప్పుగా మారుతోన్న గంజాయి, ఇతర మత్తుపదార్థాల విక్రయం, రవాణా, నిల్వ, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మత్తు పదార్థాల సరఫరాదారులు, విక్రేతలు, వినియోగదారులపై నిఘా ఉంచి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రైవ్‌లో భాగంగా వికారాబాద్, తాండూరు, పరిగి సబ్‌డివిజన్లలో నార్కోటిక్ డిటెక్షన్ కిట్లతో అనుమానితులను తనిఖీ చేశారు. పెట్రోలింగ్, వాహన తనిఖీలు, డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ డీఎస్పీ అంజయ్య, తాండూరు డీఎస్పీ యాదయ్య, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట
తాండూరు టౌన్: సమాజంలోని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తామని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య అన్నారు. శనివారం రాత్రి పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిసరాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం, రైల్వే క్వార్టర్స్‌తో పాటు పలు నిర్మానుష్య ప్రాంతాల్లో సిబ్బందితో కలిసి విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొందరు వ్యక్తులు రాత్రిళ్లుగా గుంపులుగా ఏర్పడి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటారని, అలాంటి వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చీకటి ప్రాంతాల్లో కూర్చుని సిగరెట్లు తాగుతూ, మద్యం సేవిస్తున్న పలువురు యువకుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించామన్నారు. ఇలాంటి తనిఖీలు తరచుగా నిర్వహిస్తుంటామని, దీంతో నేరాలను అదుపు చేయవచ్చన్నారు. ఈ తనిఖీల్లో పట్టణ సీఐ పరమేశ్వర్, ఎస్‌ఐ నుమాన్ అలీ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్
ఎస్పీ స్నేహమెహ్ర


