యాచారం: ఫ్యూచర్‌సిటీ నిర్మాణంతో ఈ ప్రాంతానికి ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుందని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మండల స్థాయి అధికారులు, సర్పంచులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వకపోవచ్చు కానీ కావాల్సిన నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఫార్మాసిటీలో అక్రమార్కులు, నకిలీలకు ఎట్టి పరిస్థితుల్లో ప్లాట్ల రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. అర్హులైన, నిజమైన రైతులకు త్వరలో అందజేస్తామని వెల్లడించారు. కుంటలు, వరద కాల్వలు, వర్షపు నీరు పారే దారులను కబ్జా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఫాంల్యాండ్స్ పేరుతో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డిని సూచించారు. సమావేశంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ కేవీపీ రాజు, మండల ప్రత్యేకాధికారి మాధవరావు, పంచాయతీ రాజ్ శాఖ డీఈఈ శ్రీనివాస్, విద్యుత్ శాఖ ఏడీ సీతారాం, ఎంపీడీఓ రాధారాణి, తహసీల్దార్ అయ్యప్ప, వివిధ గ్రామాల సర్పంచులు దెంది రాంరెడ్డి, కొలన్ రమాదేవి, నరేందర్‌రెడ్డి, రమేష్, నీలం ఝాన్సీ, నీలం శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు.
అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే
మండల పర్యటనలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రాజ్యలక్ష్మి ఆయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వాతావరణ మార్పులతో వైరల్ ఫీవర్ వచ్చినట్లు తెలిపారు. కాసేపటికి ఆయన కుదుటపడ్డారు.
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి


