సీపీ సజ్జనర్ శిఖర పూజ, ధ్వజారోహణ
చాంద్రాయణగుట్ట: లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయ 118వ బోనాల ఉత్సవాలు శుక్రవారం వేద పండితుల మంత్రోచ్చారణలు, డప్పు వాయిద్యాల నడుమ లాంఛనంగా ప్రారంభమయ్యాయి. నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్ ముఖ్య అతిథిగా హాజరై శిఖర పూజ, ధ్వజారోహణ చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో దేవాదాయ శాఖ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) శ్రీనివాసరావు, సౌత్ రేంజ్ అదనపు సీపీ తఫ్సీర్ ఇక్బాల్, చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే, చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
2 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు
లాల్‌దర్వాజా బోనాల జాతర ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు 2 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ సజ్జనర్ తెలిపారు. పది రోజుల పాటు వైభవంగా జరిగే బోనాలకు శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 100కు పైగా సీసీ కెమెరాలు, డ్రోన్లు, ఇతర సాంకేతిక అంశాలతో పర్యవేక్షిస్తామన్నారు.
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల సందర్భంగా 175 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి ఈ బస్సులు సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగించనున్నాయని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు.


