షాబాద్: ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలైన సంఘటన నాగరగూడ ఎక్స్ రోడ్డులో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని నాగరగూడ ఎక్స్ రోడ్డు వద్ద షాద్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును శంషాబాద్ వైపు నుంచి వస్తున్న లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 15 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్రంగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారికి నాగరగూడ శ్రీనివాస ఆస్పత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిలో చేవెళ్ల మండలం దేవరంపల్లి గ్రామానికి చెందిన నామ మమత, శంషాబాద్ మండలం సుల్తాన్‌పల్లికి చెందిన శిరీష, మరో ఇద్దరు ఉన్నారు. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కాలె శ్రీకాంత్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఆయన వెంట చేవెళ్లకు చెందిన కాంగ్రెస్ నాయకుడు మధుసూదన్‌గుప్తా ఉన్నారు.
నలుగురికి తీవ్ర గాయాలు


