నకిలీ డీఏపీ తయారీ ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

నకిలీ డీఏపీ తయారీ ముఠా అరెస్ట్‌

Aug 1 2026 7:46 AM | Updated on Aug 1 2026 7:46 AM

నకిలీ డీఏపీ తయారీ ముఠా అరెస్ట్‌

వేయి బస్తాల ఎరువు, తయారీకి ఉపయోగించే రూ.2 కోట్ల విలువైన సామగ్రి స్వాధీనం

హుజూర్‌నగర్‌: మార్కెట్‌లో డీఏపీ కొరతను ఆసరాగా చేసుకుని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన కొందరు ముఠాగా ఏర్పడి నకిలీ డీఏపీ తయారు చేసి విక్రయిస్తున్న ఆరుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన కొండేటి పిచ్చిరెడ్డితో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది ముఠాగా ఏర్పడి నకిలీ డీఏపీ దందాకు తెరలేపారు. హైదరాబాద్‌ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో గోడౌన్‌ ఏర్పాటు చేసి నకిలీ డీఏపీని తయారు చేసి అక్కడి నుంచి పలు దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. రైతులకు నకిలీ ఎరువు బస్తాలు వస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈనెల 15న మఠంపల్లి ఏఓ బొలిశెట్టి శ్రీనివాస్‌ పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు రఘునాథపాలెంలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ కొండేటి పిచ్చిరెడ్డి అనే వ్యాపారి దగ్గర నకిలీ డీఏపీ బస్తాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మఠంపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి సీఐ చరమందరాజు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు.

ఆరుగురు నిందితుల అరెస్ట్‌.. పరారీలో ఇద్దరు

పిచ్చిరెడ్డి ఇచ్చిన సమాచారంతో అబ్దుల్లాపూర్‌మెట్‌లోని జగదీష్‌ అలియాస్‌ జక్కప్ప, ఆనంద్‌ రావుకు సంబంధించిన తయారీ కంపెనీలో పోలీసులు తనిఖీ చేశారు. అక్కడ 1000 డీఏపీ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరీక్షించగా.. నకిలీదని తేలింది. దీంతో రఘునాథపాలెం గ్రామానికి చెందిన కొండేటి పిచ్చిరెడ్డి, వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌ గ్రామానికి చెందిన పొలే వెంకటేశ్వర్లు, ఏపీలోని కర్నూలు పట్టణానికి చెందిన పింజారి మౌలాలి, జోగులాంబ గద్వాల జిల్లాలోని లింగనవాయి గ్రామానికి చెందిన అబ్దుల్‌ రెహమాన్‌, కర్నాటక రాష్ట్రంలోని విజయపురి జిల్లా దేవరౌప్పరి తాలూకా మానూర్‌ గ్రామానికి చెందిన హీర్లకొండ సంతోష్‌ కుమార్‌, మఠంపల్లి మండలం బక్కమంతుగూడేనికి చెందిన పింగళి గంగామహేశ్వరరెడ్డిని అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి డీసీఎం, ఓ కారు, ఐదు సెల్‌ఫోన్లు, వివిధ కంపెనీల లేబుల్‌ కలిగిన నకిలీ డీఏపీ బస్తాలు, నకిలీ ఎరువు మందులు తయారు చేయడానికి వాడిన మిషన్‌, నకిలీ పాస్పేట్‌, దాదాపు రూ.2 కోట్ల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆనంద్‌, జగదీశ్‌ అనే ఇద్దరు పరారీలో ఉన్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. కేసు విచారణలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్‌ఐలు ప్రవీణ్‌, నవీన్‌, ఏఎస్‌ఐ బలరాం రెడ్డి, సిబ్బంది శంభయ్య, నాగరాజును అభినందించారు.

చెంగోల్‌లో నకిలీ డీఏపీ పట్టివేత

తాండూరు రూరల్‌: నియోజకవర్గంలో నకిలీ డీఏపీ కలకలం రేపుతోంది. ఇప్పటికే పరిగి, యాలాల మండలాల్లో నకిలీ డీఏపీని వ్యవసాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకోగా.. శుక్రవారం తాండూరు మండలం చెంగోల్‌ గ్రామంలో నకిలీ డీఏపీ పట్టుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, కరన్‌కోట్‌ పోలీసులు 89 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. తాండూరు ఏడీఏ అరుణ, పోలీసుల కథనం ప్రకారం.. ఉదయం గ్రామంలోని పలువురి రైతుల ఇళ్లలో తనిఖీ చేశారు. 89 బస్తాలను స్వాధీనం చేసుకొని కరన్‌కోట్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పెద్దేముల్‌ గ్రామానికి చెందిన పోల రాజు, ఆత్కూర్‌కు చెందిన శివకుమార్‌ వీటిని విక్రయించినట్లు తేలింది. దీంతో వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రధాన సూత్రధారి పెద్దేముల్‌ వాసి

జిల్లాలో నకిలీ డీఏపీ విక్రయించడంలో పెద్దేముల్‌ గ్రామానికి చెందిన పోల రాజుగా పోలీసులు గుర్తించారు. పరిగి, యాలాల కూడా ఆయనపై కేసులు నమోదయ్యాయి. చెంగోల్‌లో దాదాపు 200 బస్తాలు విక్రయించినట్లు తెలిసింది. ప్రస్తుతం 89 బస్తాలను స్వాధీనం చేసుకొగా మిగిలిన 111 బస్తాలను రైతులు పొలాల్లో వరి, పత్తి పంటలకు వాడినట్లు అధికారులు గుర్తించారు. రైతులు నకిలీ డీఏపీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఏడీఏ అరుణ, మండల అధికారి కొమురయ్య సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement