మొయినాబాద్: ‘ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.. మురుగు నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలి.. వీధుల్లో, రోడ్లపై చెత్తాచెదా రం వేయొద్దు.. ఇళ్ల చుట్టూ అపరిశుభ్రంగా ఉన్నా.. రోడ్డు పక్కన చెత్త వేసినా జరిమానా వేస్తాం’ అంటూ సమావేశాల్లో పరిశుభ్రత గురించి చెప్పే అధికారులు.. తమ కార్యాలయాలను మాత్రం పరిశుభ్రంగా పెట్టుకోవడంలేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెత్తాచెదారం, గడ్డి, పిచ్చిమొక్కలు పెరిగినా తమకేమీ పట్టనట్లు వదిలేశారు.
అన్నీ ఒకే చోట
మొయినాబాద్ మండల ప్రభుత్వ కార్యాలయాల సముదాయం అపరిశుభ్రతకు నెలవుగా మారింది. ఒకే ఆవరణలో మండల పరిషత్, తహసీల్దార్, విద్యావనరుల, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, చేవెళ్ల డీసీపీ కార్యాలయాలతో పాటు మహిళా సమాఖ్య భవనం, రైతు వేదిక, వికలాంగుల సమాఖ్య భవనాలున్నాయి. ఆఫీసుల ముందుభాగంలో కొంత వరకు శుభ్రంగా ఉన్నప్పటికీ చుట్టుపక్కల మాత్రం గడ్డి, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. ఇటీవల వర్షాలు కురుస్తుండటంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. వివిధ పనుల నిమిత్తం ఆయా ఆఫీసులకు వస్తున్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వరద ద్వారా కొట్టుకువచ్చిన మట్టి మండల పరిషత్ కార్యాలయం ఎదుట సీసీపై పేరుకుపోయి, బురద అంటుకుంటోంది.
పిచ్చిమొక్కలకు నెలవుగా ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలు
మొయినాబాద్‌లో ఆఫీసుల చుట్టూ చెత్తాచెదారం
దోమలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు
పట్టించుకోని అధికారులు


