యాచారం: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘా(పీఏసీఎస్)లు యూరియా బుకింగ్‌ను నిలిపేశాయి. రవాణా, హమాలీ చార్జీలను చెల్లింపును నిలిపేస్తున్నట్లు తాజాగా మార్క్‌ఫెడ్ నుంచి పీఏసీఎస్‌లకు ఆదేశాలు అందాయి. ఈనిర్ణయంతో పీఏసీఎస్‌లకు నష్టం వాటిల్లుతుందని, ఈ నేపథ్యంలో యూరియా అమ్మలేమని వారం రోజులుగా బుకింగ్‌లు నిలిపేశారు. జిల్లా వ్యాప్తంగా 37 పీఏసీఎస్‌లు ఉండగా అందులో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, షాద్‌నగర్, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని గ్రామీణా ప్రాంతాల్లో ఉన్న పీఏసీఎస్‌లు మార్క్‌ఫెడ్ నుంచి యూరియాను దిగుమతి చేసుకుని స్వల్ప ఆదాయంతో రైతులకు అందజేసేవారు. ఇలా ప్రతీ వారం 37 పీఏసీఎస్‌లకు వందకు పైగా లారీల్లో వందలాది మెట్రిక్ టన్నుల యూరియా మూసాపేట తదితర ప్రాంతాల నుంచి గ్రామాలకు చేరుకునేది. యూరియా దిగుమతికి అవసరమైన రవాణా ఛార్జీలను మార్క్‌ఫెడ్ నుంచే చెల్లించేవారు.
వారానికి రూ.17 లక్షల నష్టం
యూరియా దిగుమతి రవాణా, హమాలీ చార్జీలను మీరే భరించాలని ఈ నెల 14న మార్క్‌ఫెడ్ నుంచి పీఏసీఎస్‌లకు ఉత్తర్వులు అందాయి. మార్కెఫెడ్ నుంచి ప్రతి వారం వందకు పైగా లారీలు వస్తే రవాణా ఛార్జీల కింద రూ.17,94,350 నష్టపోవాల్సి వస్తుంది. లాభాలు దేవుడెరుగు కానీ రూ.లక్షల్లో నష్టాలను భరించడం తమ వల్ల కాదని సొసైటీలు చేతులెత్తేస్తున్నాయి. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి, చేవేళ్ల నియోజకవర్గాల్లోని పలు పీఏసీఎస్‌లు యూరియా బుకింగ్‌ను పూర్తిగా బంద్ చేశాయి. ఇదిలా ఉండగా నగర ప్రాంతాల్లో వ్యవసాయం చేసే ధనవంతులైన కొంతమంది రైతులు అధిక ధరకు( బస్తాకు రూ.50 అదనంగా చెల్లించి) యూరియాను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారనే ఆరోపణలున్నాయి.
వర్షాలు కురిసే సమయంలో
వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ ఏడాది పంటల సాగు గణనీయంగా తగ్గింది. పలు మండలాల్లో పత్తి పంటలను ఆలస్యంగా సాగుచేశారు. యాప్‌ల ద్వారా యూరియా బుకింగ్ అవుతుండగా.. కొంతమంది రైతులకు అవగాహన లేని కారణంగా డీలర్లే రైతుల పట్టాదారు, పాసుపుస్తకాలు తీసుకుని బుక్ చేస్తున్నారు. వీటిలో కొన్నింటిని అధిక ధరలకు బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలకు యూరియా వేసేందుకు రైతులు ఆసక్తి చూపుతుండగా ఎక్కడా స్టాక్ దొరకడం లేదు. పలు చోట్ల పీఏసీఎస్‌లు అధిక ధరలకు యూరియాను విక్రయించే ప్రయత్నాలు చేయగా వ్యవసాయ శాఖ తీవ్ర వ్యతిరేకించింది. ప్రభుత్వ ధరలకే విక్రయించాలని లేదంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది.
యూరియా అమ్మకాలు ఇలా(బస్తా)
● మార్క్‌ఫెడ్ నుంచి అందే ధర: రూ.252.43 పైసలు
● పీఏసీఎస్‌లు రైతులకు విక్రయించే ధర: రూ.267
● ఒక బస్తా యూరియా అమ్మితే పీఏసీఎస్‌లకు వచ్చే లాభం: రూ. 14.57 పైసలు
● ఒక లారీ( 450 బస్తాలు) లోడ్ యూరియా అమ్మితే వచ్చే లాభం: 6,556.50 పైసలు
● లారీ నుంచి యూరియా దించుకోవడం కోసం హమాలీ చార్జీలు: రూ.4,500 (బస్తాకు రూ.10 చొప్పున)
● లారీ లోడ్( 450 బస్తాల) యూరియా అమ్మితే పీఏసీఎస్‌లకు మిగిలే లాభం కేవలం రూ.2,056.50 పైసలు మాత్రమే.
● ప్రస్తుతం రవాణా చార్జీల రద్దుతో మార్క్‌ఫెడ్ నుంచి పీఏసీఎస్‌లకు యూరియా దిగుమతి చేసినందుకు గాను లారీ ట్రాన్స్‌ఫోర్ట్ చార్జీ: రూ.20 వేలు, అంటే ప్రతి లారీ యూరియా లోడ్‌పైన పీఏసీఎస్‌లకు 17,943.50 నష్టం వస్తుంది.
చేతులెత్తేసిన పీఏసీఎస్‌లు
రవాణా, హమాలీ ఛార్జీల చెల్లింపును నిలిపేసిన మార్క్‌ఫెడ్
యూరియా బుకింగ్‌లు ఆపేసిన సహకార సంఘాలు
లబోదిబోమంటున్న రైతులు
ఏం తోచడం లేదు
ఈ ఏడాది యాభై ఎకరాల్లో పత్తి సాగు చేశాను. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పంటకు యూరియా అందించడం అత్యవసరం. కానీ పీఏసీఎస్‌లలో యూరియా అందుబాటులో లేదు. దీంతో ఏంచేయాలో తోచడం లేదు.
– బత్తుల కొండల్‌రెడ్డి, రైతు మాడ్గుల
రైతులు చెల్లిస్తే..
ఇన్నాళ్లూ యూరియా దిగుమతి చేసుకుంటే మార్క్‌ఫెడ్ నుంచి రవాణా ఛార్జీలు చెల్లించే వారు. ఈనెల 14నుంచి ఛార్జీల చెల్లింపులు నిలిపేస్తున్నట్లు ఉత్తర్వులు అందాయి. దీంతో యూరియా అమ్మకాల వల్ల నష్టపోతాయనే భయంతో సొసైటీలు బుకింగ్‌ను నిలిపేశాయి. రవాణా, హమాలీ ఛార్జీలు రైతులు చెల్లించినట్లయితే పీఏసీఎస్‌లు యూరియా అమ్మకోవచ్చు.
– సి.సుధాకార్, సహకార శాఖ అధికారి, రంగారెడ్డి జిల్లా


