● నేటితో ముగియనున్న గడువు!
● ఆందోళనలో లబ్ధిదారులు
చేవెళ్ల: రేషన్ లబ్ధిదారులకు ఈకేవైసీ తప్పనసరి చేయడంతో కార్డుదారులు రేషన్ దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. 31వ తేదీలోపు అప్‌డేట్ చేయించుకున్న వారికి మాత్రమే రేషన్ సరుకులు అందుతాయని చెబుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఈకేవైసీ చేయించుకున్న వారు కాకుండా కొత్తగా రేషన్ కార్డుల్లో యాడ్ చేసుకున్న వారు, పిల్లలు మాత్రమే ఈకేవైసీ చేయించుకోవాలని డీలర్లు చెబుతున్నారు. మండలంలో 18,666 రేషన్ కార్డులు, 42 దుకాణాలు ఉన్నాయి. ఐదేళ్లలోపు చిన్నారులకు మినహా మిగిలిన వారికి తప్పని సరిగా ఈకేవైసీ ఉండాలని చెబుతున్నారు. కొంత మంది చిన్నారుల ఆధార్‌కార్డుల అప్‌డేట్ చేసుకోకపోవటంతో బయో మెట్రిక్, ఐరిస్ తీసుకోవడం లేదు. కొంత మంది విద్యార్థులు హాస్టల్స్‌లో, ఇతరప్రాంతాల్లో ఉన్న వారు ఈకేవైసీ చేయించుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం గడువు పెంచాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
చన్గోముల్ ఎస్‌ఐని సస్పెండ్ చేయాలి
● ప్రజాసంఘాల నేతల డిమాండ్
● బాధితుడిపైనే కేసు నమోదు చేశారని ఆందోళన
బొంరాస్‌పేట: దళితుడి భూమి ఆక్రమణకు సహకరిస్తూ బాధితుడిపైనే కేసు నమోదు చేసిన పూడూరు మండలం చన్గోముల్ ఎస్‌ఐ భరత్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బొంరాస్‌పేటలో గురువారం వారు మాట్లాడుతూ.. పూడూరు మండల సోమన్‌గుర్తి గ్రామానికి చెందిన దళిత రైతు జైదుపల్లి నర్సింలుకు చెందిన సర్వే నం.120లో 1.35 ఎకరాల్లోని 30గుంటల భూమిని ఏసీఈ టైర్స్ కంపెనీ యాజమాన్యం ఆక్రమించిందన్నారు. దీనిపై విచారణ చేయకుండా స్థానిక ఎస్సై దళిత రైతుపై కేసు పెట్టారని ఆరోపించారు. కంపెనీ యాజమాన్యం ఆక్రమించిన భూమిని వెంటనే ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బాధితుడి పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి నర్సింలు, ప్రజాసంఘాల నాయకులు రమేశ్, మొగులయ్య, రాములు, ఎల్లప్ప, వెంకటయ్య, నరేశ్, ప్రవీణ్, రాంచందర్ తదితరులు ఉన్నారు.


