షాద్‌నగర్: ఉపాధి పేరుతో వచ్చి.. చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను షాద్‌నగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్‌జోషి వెల్లడించారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన సుఖ్‌దేవ్‌సింగ్, షమేర్ సింగ్, మన్‌ప్రీత్‌సింగ్ ఉపాధి కోసం కొంతకాలం క్రితం రాష్ట్రానికి వచ్చారు. హార్వెస్టర్ డ్రైవర్లు, కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సులువుగా డబ్బు సంపాదించేందుకు చైన్ స్నాచింగ్‌లకు, ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 25వ తేదీన కేశంపేట మండలం సంతాపూర్‌లో ఈ నలుగురు దుండగులు బైక్‌లపై వచ్చి ఓ వృద్ధురాలి మెడలోంచి నాలుగు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కెళ్లారు. కడ్తాల్ ఠాణా పరిధిలో మరో మహిళను బెదిరించి ఆమె మెడలోంచి మూడు తులాల పుస్తెల తాడును అపహరించుకెళ్లినట్లు తెలిపారు. జూలై 24న మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఏటీఎం వద్ద పార్కు చేసిన బైకును, జూన్‌లో వనపర్తి జిల్లా కొత్తకోటలో చోరీ చేసిన ద్విచక్రవాహనాలపై తిరుగుతూ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
కేశంపేటలో అరెస్టు
కేశంపేట చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న సుఖ్‌దేవ్‌సింగ్, షమేర్ సింగ్, మన్‌ప్రీత్‌సింగ్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా కేశంపేట, కడ్తాల్, మహబూబ్‌నగర్, కొత్తపేట ఠాణాల పరిధిలో చేసిన చోరీలను ఒప్పుకొన్నారని తెలిపారు. వారి వద్ద నుంచి ఏడు తులాల బంగారు ఆభరణాలు, మూడు సెల్‌ఫోన్లు, ఓ ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సమావేశంలో షాద్‌నగర్ డీసీపీ శిరీషా రాఘవేంద్ర, ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ నరహరి, ఎస్‌ఐ రాజ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులకు రిమాండ్
ఏడు తులాల బంగారు ఆభరణాలు, ఓ ద్విచక్రవాహనం, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్‌జోషి


