రూ.158 కోట్ల నిధుల మళ్లింపు | - | Sakshi
Sakshi News home page

రూ.158 కోట్ల నిధుల మళ్లింపు

Jul 30 2026 7:18 AM | Updated on Jul 30 2026 7:18 AM

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అత్యంత రద్దీగా ఉండే బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 3 కారిడార్‌లో ట్రాఫిక్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్‌న్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌, టీవీ9 జంక్షన్‌న్‌ల వద్ద మొత్తం రూ.368 కోట్ల అంచనా వ్యయంతో రెండు ఫ్లైఓవర్లు, ఒక అండర్‌పాస్‌ నిర్మాణానికి పరిపాలనా ఆమోదం తెలిపింది. గతంలో ఈ జంక్షన్ల వద్ద రూ.210 కోట్ల పనులకు ఇచ్చిన అనుమతులు సవరించి, ట్రాఫిక్‌ అవసరాలకనుగుణంగా కొత్త ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. ఈ మేరకు స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ జీఓ జారీ చేశారు. హెచ్‌ఎండీఏ నిర్వహించిన సమగ్ర ట్రాఫిక్‌ అధ్యయనం మేరకు, నగరంలో గత దశాబ్ద కాలంలో వాణిజ్య కార్యకలాపాలు విస్తరించడంతో బంజారాహిల్స్‌–జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడుతోందని జీహెచ్‌ఎంసీ ప్రభుత్వానికి నివేదించింది. ఈ నేపథ్యంలో ఎన్‌న్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌ నుంచి ఆల్విన్‌ క్రాస్‌ రోడ్స్‌ వరకు అంతరాయం లేని ట్రాఫిక్‌ కారిడార్‌ అభివృద్ధి కోసం,సాంకేతిక నిపుణులతో సమీక్ష నిర్వహించి సవరించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది.

మారిన ప్రణాళిక..

సవరించిన ప్రణాళిక ప్రకారం.. ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌ వద్ద బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 3 నుంచి జీవీకే మాల్‌ వైపు రెండు లేన్ల ఫ్లైఓవర్‌ను రూ.147 కోట్లతో నిర్మించనున్నారు. టీవీ9 జంక్షన్‌ వద్ద ముగ్ధ జంక్షన్‌ నుంచి ఎనన్‌్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌ వైపు మూడు లేన్ల ఫ్లైఓవర్‌ను రూ.62 కోట్లతో, ఎన్‌న్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌ నుంచి శ్రీనగర్‌ కాలనీ వైపు రెండు లేన్ల అండర్‌పాస్‌ను రూ.159 కోట్లతో నిర్మించనున్నారు. ఈ మూడు పనుల మొత్తం వ్యయం రూ.368 కోట్లకు చేరింది.

గతంలో మంజూరైన ప్లాన్‌లో ఎన్‌న్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌ వద్ద ఒక ఫ్లైఓవర్‌, టీవీ9 జంక్షన్‌ వద్ద ఒక అండర్‌పాస్‌ మాత్రమే ఉండగా, తాజా ట్రాఫిక్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అదనంగా ఫ్లైఓవర్‌ను చేర్చడం, అండర్‌పాస్‌ దిశను మార్చడం వంటి మార్పులు చేశారు. దీంతో ప్రాజెక్టు వ్యయం రూ.158 కోట్ల మేర పెరిగింది.ఈ అదనపు వ్యయాన్ని భరించేందుకు హెచ్‌–సిటీ ప్యాకేజీ–2లో ప్రతిపాదించిన విప్రో జంక్షన్‌ మల్టీలెవల్‌ గ్రేడ్‌ సెపరేటర్‌ పనులను ప్రస్తుతానికి నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ పనులకు కేటాయించిన రూ.158 కోట్లను బంజారాహిల్స్‌ కారిడార్‌ పనులకు మళ్లిస్తూ అనుమతి ఇచ్చింది. దీంతో హెచ్‌–సిటీకి మంజూరైన రూ.5,942 కోట్ల మొత్తంనిధుల్లో పెంపుదల లేకుండా చేసింది.

స్టీల్‌ ఫ్లైఓవర్లు

పనులను సంప్రదాయ కాంక్రీట్‌ నిర్మాణాల బదులుగా స్ట్రక్చరల్‌ స్టీల్‌తో నిర్మించేందుకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చింది. దీనివల్ల నిర్మాణ సమయం తగ్గడంతో పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కూడా పరిమితమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఇక బంజారాహిల్స్‌ కారిడార్‌గా...

ఇప్పటివరకు ఈ పనులను ’జూబ్లీహిల్స్‌’ పేరుతో పేర్కొనగా, వాస్తవ ప్రాంతానికి అనుగుణంగా ఇకపై ’బంజారాహిల్స్‌’గా పేర్కొనాల్సిందిగా ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర బడ్జెట్‌లో హెచ్‌–సిటీ కార్యక్రమం కింద జీహెచ్‌ఎంసీకి కేటాయించే నిధుల నుంచే ఈ వ్యయం భరించనున్నారు.

ఎన్‌ఎఫ్‌సీఎల్‌, టీవీ9 జంక్షన్ల వద్ద పనులకు తరలింపు

రూ.368 కోట్లతో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌కు ఆమోదం

హెచ్‌–సిటీలో భారీ సవరణ

స్టీల్‌ నిర్మాణంతో ఫ్లై ఓవర్లు..

బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ జామ్‌కు చెక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement