ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు | - | Sakshi
Sakshi News home page

ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

Jul 29 2026 9:51 AM | Updated on Jul 29 2026 9:51 AM

ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు వర్షపు నీటిని ఒడిసిపడుదాం షాద్‌నగర్‌లో రెండోరోజు ఆక్రమణల తొలగింపు లేబర్‌ కోడ్‌లతో కార్మికులకు అన్యాయం

షాద్‌నగర్‌: ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు చేవెళ్ల డీసీపీ యోగేష్‌ గౌతమ్‌ అన్నారు. కొత్తూరు, నందిగామ, షాద్‌నగర్‌తో పాటు శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ప్రమాదభరితంగా ఉన్న రహదారులు, బ్లాక్‌ స్పాట్‌లను మంగళవారం షాద్‌నగర్‌ ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐలు సీతారాం, వీరబాబు, నర్సయ్య, ఎన్‌హెచ్‌ఏఐ ఇంజనీయర్‌ భాను ప్రతాప్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. రహదారి భద్రతను మరింత మెరుగుపర్చడం కోసం చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ప్రతి వాహనదారుడు విఽధిగా రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.

శంకర్‌పల్లి: పట్టణాలు, గ్రామాల్లో అడుగంటిన భూగర్భ జలాలను పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని జిల్లా పంచాయతీ రాజ్‌ ఇంజనీర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో మంగళవారం పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్‌ అసిస్టెంట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌లతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అవకాశం ఉన్న ప్రాంతాల్లో విరివిగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని, తద్వారా వర్షపు నీటిని ఒడిసి పట్టడంతో భూగర్భ జలాలు పెరుగుతాయని స్పష్టం చేశారు. దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించి, భాగస్వాములను చేయాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీఓ ప్రవీణ్‌ కుమార్‌, ఎంపీఓ గిరి రాజు, పంచాయతీ రాజ్‌ ఏఈ నంద కిశోర్‌, ఏపీఓ నాగభూషణం, సిబ్బంది పాల్గొన్నారు.

షాద్‌నగర్‌: చౌరస్తా విస్తరణలో భాగంగా పట్టణంలో మంగళవారం రెండోరోజు ఆక్రమణల తొలగింపు కొనసాగింది. హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ రహదారుల్లో ఉన్న ఆక్రమణలను మున్సిపల్‌, రెవెన్యూ, పోలీసు, ఆర్‌అండ్‌బీ, విద్యుత్‌ అధికారులు తొలగించారు. పోలీసుల బందోబస్తు మధ్య జేసీబీల సాయంతో డబ్బాలు, షెడ్‌లను తీసివేశారు. తొలగింపు ప్రక్రియను ఆర్డీఓ సరిత, తహసీల్దార్‌ నాగయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ సునీత, సీఐ సీతారాం, ఆర్‌అండ్‌బీ అధికారులు పరిశీలించారు.

మొయినాబాద్‌: కార్మికులకు తీవ్ర అన్యాయం కలిగించే నాలుగు లేబర్‌ కోడ్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కె.రామస్వామి అన్నారు. సంఘం జిల్లా 4వ మహాసభల వాల్‌పోస్టర్‌ను మంగళవారం మొయినాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు సంబంధించిన 44 రకాల చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మార్చి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. 29 రకాల చట్టాలను పునరుద్ధరించి.. నాలుగు లేబర్‌ కోడ్‌లను పూర్తిగా రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆగస్టు 2న తుక్కుగూడలో జరిగే ఏఐటీయూసీ జిల్లా మహాసభలకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, సీపీఐ మండల కార్యదర్శి కె.శ్రీనివాస్‌, నాయకులు సురేష్‌, బాబు, హనుమంతు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement