● వైభవంగా శోభాయాత్ర
కందుకూరు: గురుపౌర్ణమిని పురస్కరించుకుని వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి పాదయాత్ర, సైకిల్ యాత్రగా తరలివచ్చిన సాధకులతో బ్రహ్మశ్రీ గురూజీ అనిల్‌కుమార్‌జోషి ఆధ్వర్యంలో చేపట్టిన రథయాత్ర, పల్లకీ సేవ వైభవంగా కొనసాగింది. మంగళవారం సాయంత్రం రథం, పల్లకీలపై స్వామి నిఖిలేశ్వరానంద విగ్రహాలను ఏర్పాటు చేసిన భక్తులు కందుకూరు చౌరస్తా నుంచి పులిమామిడి పరిధిలోని శ్రీనిఖిల్ చేతనా కేంద్రం వరకు యాత్ర శోభాయమానంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు డప్పువాయిధ్యాలతో పాటు కోలాటాలు, నృత్యాలు, భక్తి గీతాలాపనల నడుమ యాత్రలో పాల్గొన్నారు. కందుకూరు చౌరస్తా నుంచి యాత్ర ప్రారంభమై కొత్తగూడ, జైత్వారం, పులిమామిడి గ్రామాల మీదుగా శ్రీనిఖిల్ చేతనా కేంద్రం వరకు సాగింది. దారి పొడవునా భక్తులు, స్తానికులు గురూజీకి ఘన స్వాగతం పలికారు. ఆశ్రమానికి చేరుకున్న అనంతరం గూరూజీ ప్రవచనాలు చేసి, భక్తులకు ప్రసాదాలతో పాటు ఆశీర్వాదాలు అందించారు. ఈ సందర్భంగా యాత్ర సాగిన గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది.


