కడ్తాల్: మండల పరిధిలో గతంలో పట్టాలు ఇచ్చిన భూదాన్ భూమి రైతులకు పొజిషన్ చూపించాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు బోడ సామెల్, ప్రధాన కార్యదర్శి మస్కు ప్రకాశ్ కారత్ డిమాండ్ చేశారు. సీఐటీయూ మండల కన్వీనర్ పెంటయ్య ఆధ్వర్యంలో మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కడ్తాల్ రెవెన్యూ పంచాయతీ పరిధిలో 2004లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, సర్వేనంబర్ 260/9లో 40 మంది పేద రైతులకు భూదాన్ బోర్డ్ ద్వారా సర్టిఫికెట్‌లు ఇచ్చినట్టు తెలిపారు. ఇప్పటి వరకు వారికి పోజిషన్ చూపించలేదని అన్నారు. అధికారులు స్పందించకపోవడంతో రైతులతో కలిసి హైకోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు. హైకోర్టు అనుకూలంగా తీర్పు చెప్పినా అధికారులు బేఖాతరు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికై నా పేదలకు సంబంధించిన భూదాన్ భూమిలో పొజిషన్ చూపించి న్యాయం చేయాలని కోరారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు దుబ్బ చెన్నయ్య, జిల్లా కమిటీ సభ్యులు మేకల అశోక్, రాములు, రమేశ్, నర్సింహ, మల్లేశ్, జంగయ్య, యాదయ్య, శ్రీకాంత్, జంగమ్మ, కళమ్మ, చంద్రకళ తదితరులు ఉన్నారు.


