సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఔటర్ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ను అనుసంధానించే గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే భూ సేకరణ దాదాపు పూర్తయింది. ఎత్తుపల్లాల చదును, అండర్‌పాస్‌లు, వంతెనల నిర్మాణ పనులు మొదలయ్యాయి. రోడ్డుకు అడ్డుగా ఉన్న ఎత్తయిన కొండలు, గుట్టలను తొలగించే పని మొదలైంది. 41.50 కిలోమీటర్ల దూరం 100 మీటర్ల విస్తీర్ణంలో 6 లేన్ల రహదారి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మొత్తం వెయ్యి ఎకరాలు సేకరించారు. దీనిలో 87.66 హెక్టార్ల అటవీ భూమి కూడా ఉంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.4,030 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. రావిర్యాల ఎగ్జిట్ –13 నుంచి మీర్‌ఖాన్‌పేట, అటు నుంచి ఆకుతోటపల్లి వరకు 19.20 కిలో మీటర్లు ఫేజ్–1 కింద రూ.1,665 కోట్ల అంచనా వ్యయంతో పనులను చేస్తున్నారు. రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ పనులను దక్కించుకుంది. ఇక మీర్‌ఖాన్‌పేట నుంచి ఆమనగల్లు వరకు 22.30 కిలోమీటర్ల దూరం రోడ్డు పనులను ఫేజ్–2 కింద చేపడుతున్నారు. రూ.2,365 కోట్ల అంచనాతో రూపొందించిన ఈ పనులను ఎల్‌అండ్‌టీ దక్కించుకుంది. భూములు ఇచ్చేందుకు నిరాకరించిన రైతుల నష్టపరిహారాన్ని అదాలత్‌లో జమ చేశారు. ఎలాంటి వివాదం లేని చోట రోడ్డు విస్తరణ, కల్వర్టులు, వంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణం చేపడుతున్నారు.
ఇప్పటికే భూ సేకరణ
శంషాబాద్ ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ 17 నుంచి పరిగి వరకు 55 కిలోమీటర్ల రేడియల్ రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ మొదలైంది. కొత్వాల్‌గూడ, అమ్మపల్లి, నర్కూడ, సుల్తాన్‌పూర్, మల్కారం, కాచారం, రాయన్నగూడ, రామాంజాపూర్, సోలిపేట, హైతాబాద్, పెద్దవీడు, దామర్లపల్లి, మానపల్లి, నాగర్‌కుంట, బోన్‌గిరిపల్లి, కొమరబండ, ఉబ్బకుంట, కంకల్, మాచన్‌పల్లి, పరిగి, మాదారం, రాకంచర్ల మీదుగా త్రిబుల్ ఆర్ వరకు రేడియల్ రోడ్డు పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసి రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. మెజార్టీ రైతులు భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. మార్కెట్ ధరకు మించి నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవడంతో కొంతమంది రైతులు భూములను స్వచ్ఛందంగా ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. మరికొంత మంది మొండికేస్తుండటంతో వారి నష్టపరిహారాన్ని కోర్టులో జమ చేసి, భూ సేకరణ పనులు మొదలుపెట్టారు.
శరవేగంగారేడియల్ రోడ్డు పనులు
మొదటి విడతలో ర్యావిర్యాల నుంచి మీర్‌ఖాన్‌పేట వరకు
సెకండ్ ఫేజ్‌లో మీర్‌ఖాన్‌పేట నుంచి ఆకుతోటపల్లి వరకు పనులు
బుద్వెల్ నుంచి కొడంగల్ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు వేగంగా భూసేకరణ


