తాకట్టు పెడతాడు.. తస్కరిస్తాడు! | - | Sakshi
Sakshi News home page

తాకట్టు పెడతాడు.. తస్కరిస్తాడు!

Jun 30 2026 4:44 PM | Updated on Jun 30 2026 4:44 PM

అద్దె కార్లతో ముదస్సిర్‌ దందా

అద్దె కార్లతో ముదస్సిర్‌ దందా

విచారణలో ఇది గుర్తించిన టాస్క్‌ఫోర్స్‌

సూరజ్‌ సోదరుడికి ‘ఖలిస్థాన్‌’ లింకులు

సాక్షి, సిటీబ్యూరో: బంగారం, వస్తువులు, వాహనాలను తస్కరించి తాకట్టు పెట్టిన ఉదంతాలు తరచు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. చాలా మంది చోరుల నైజమే ఇది. అయితే జూబ్లీహిల్స్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గత వారం పట్టుకున్న ముదస్సిర్‌ హుస్సేన్‌ వ్యవహారం దీనికి భిన్నం. అతను కార్లను తాకట్టు పెట్టిన తర్వాత తస్కరిస్తుంటాడు. ఆ నిందితుడిని వివిధ కోణాల్లో విచారించిన అధికారులు ఈ విషయం గుర్తించారు. మరోపక్క ఇతడికి బాస్‌గా వ్యవహరించిన నాందేడ్‌ గ్యాంగ్‌స్టర్‌ సూరజ్‌ సింగ్‌కు ఖలిస్థాన్‌ ఉగ్రవాదులతో లింకులు ఉన్నట్లు బయటపడింది. దీంతో ముదస్సీర్‌ వ్యవహారాన్ని నగర పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు.

కార్ల విక్రయంతోనే మొదలైన కథ...

పాతబస్తీలోని ఖిల్వత్‌ ప్రాంతానికి చెందిన ముదస్సిర్‌ హుస్సేన్‌ అలియాస్‌ షా బాబా 2022లో ముంబై వెళ్లాడు.ఆ తరువాత స్నేహితుడి ద్వారా ముంబైలో కార్లు ఖరీదు చేసి నగరంలో విక్రయించడం ప్రారంభించాడు. తొలిసారిగా అక్కడ ఓ కారును రూ.1.35 లక్షలకు ఖరీదు చేసి నగరానికి తరలించి రూ.1.75 లక్షలకు అమ్మాడు. ఇలా మొదలైన వ్యాపారాన్ని 2024 వరకు చేశాడు. ఈ సందర్భంలో ఇతడి స్నేహితుడైన షోయబ్‌ ద్వారా నాందేడ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్‌ సూరజ్‌ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. పేకాటకు బానిసగా మారిపోయిన ముదస్సిర్‌ మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి ఆడటం మొదలెట్టాడు.

ఇక్కడ నుంచి అద్దెకు తీసుకెళ్లి..

ఈ పేకాట శిబిరాలకు వెళ్లడానికి ముదస్సిర్‌ నగరం నుంచే సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లను అద్దెకు తీసుకునే వాడు. ఎల్లో రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌ కాకుండా వైట్‌ ప్లేట్‌తో ఉన్న వాటినే తీసుకునే వాడు. దారిలో ఆర్టీఏ, ట్రాఫిక్‌ అధికారులు తనిఖీ చేస్తే అది తన స్నేహితుడిదని చెప్పేవాడు. మహారాష్ట్రకు చేరడానికి ముందే ఆ వాహనానికి ఓ మారు తాళం తయారు చేయించి దగ్గర పెట్టుకునే వాడు. పేకాటలో డబ్బు వస్తే అంతా సజావుగానే ఉండేది. డబ్బు కోల్పోతే మాత్రం ఆ కారు తనదే అంటూ పేకాట శిబిరం నిర్వాహకుల వద్ద తాకట్టు పెట్టేవాడు. అలా వచ్చిన డబ్బుతో మళ్లీ పేకాట ఆడి.. అదును చూసుకుని తన వద్ద ఉన్న మారు తాళంతో ఆ వాహనాన్ని తస్కరించుకు వచ్చేవాడు.

ఖలిస్థాన్‌ లింకులపై ఆరా..

గ్యాంగ్‌స్టర్‌ సూరజ్‌ సింగ్‌తో పాటు అతడి సోదరుడు ఆకాష్‌ సింగ్‌కు ఖలిస్థాన్‌ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి. సూరజ్‌ ముఠాతో ముదస్సిర్‌ 2024లో తొలినేరం చేశాడు. కర్ణాటకలోని బసవకళ్యాణ ప్రాంతంలో తన బంధువు నుంచి రావాల్సిన డబ్బు వసూలు కోసం దోపిడీకి పాల్పడ్డాడు. ఈ కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చిన తర్వాతే సూరజ్‌ ఆదేశాల మేరకు మహారాష్ట్రలో గణపతిరావు షిండే కిడ్నాప్‌కు పాల్పడ్డాడు. సూరజ్‌తో అత్యంత సన్నిహితంగా మెలిగిన ముదస్సిర్‌కు కూడా ఖలిస్థాన్‌ లింకులు ఉన్నాయని అధికారులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన సందేహాలు నివృతి చేసుకోవడానికి వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. ముదస్సిర్‌ను పోలీసు కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇతడికి తుపాకులు విక్రయించిన వ్యక్తుల వివరాలు ఆరా తీయనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement