అనంతగిరి: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఫిరాయింపుల కేసు విషయంలో అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ మండిపడ్డారు. స్పీకర్‌పై మాట్లాడే సమయంలో నోరు అదుపులో పెట్టుకోవాలని హితవుపలికారు. సోమవారం ఆయన వికారాబాద్‌లో పార్టీ ముఖ్యనేతలతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదేళ్లు మీరు చేసిన కుటుంబ అవినీతి పాలనకు ప్రజలు చరమగీతం పాడారాన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను వారి పార్టీలో చేర్చుకునే రోజు పార్టీ ఫిరాయింపులు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. దలిత ముఖ్యమంత్రి, మూడు ఎకరాల భూమి పేరిట ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన బీఆర్‌ఎస్ నేతలు ఎన్నికల హామీలపై మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రూ.21వేల కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం చేస్తున్నామన్నారు. పదేళ్లలో బీజాపూర్ హైవే, అప్పా –మన్నెగూడ పనులు ఎందుకు చేపట్టలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. హ్యామ్ కింద జిల్లాలో రోడ్ల అభివృద్ధికి రూ.520 కోట్లు మంజూరు చేశామన్నారు. కోట్‌పల్లి ప్రాజెక్టును రూ.90 కోట్లతో ఆధునీకరిస్తున్నామన్నారు.
పదేళ్లలో అభివృద్ధి శూన్యం: అనన్య
అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య మాట్లాడుతూ.. జడ్జిమెంట్‌లో అనుమానాలుంటే అడగాలని స్పీకర్ చెప్పినా అది చేయలేక రాజకీయ పబ్బంగడుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జిల్లాలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. మీ పాలనలో చేసిన అప్పుల తిప్పలతో పాటు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. కేటీఆర్ స్పీకర్‌పై మర్యాదపూర్వకంగా మాట్లాడాలని తెలిపారు. అనంతరం పట్టణ పార్టీ అధ్యక్షుడు, వైస్ చైర్మన్ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి పనిచేస్తోందన్నారు. ఎంపీ ప్రొటోకాల్ విషయంలో ఇబ్బందులుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఈ సమావేశంలో ఆర్‌టీఏ సభ్యుడు ఎర్రవల్లి జాఫర్, పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్లు శ్రీనివాస్ ముదిరాజు తదితరులు పాల్గొన్నారు.


