మూడో అంతస్తు నుంచి జారిపడి మృతి
ఇబ్రహీంపట్నం రూరల్: పెండ్లి పందిరి వేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. బ్రాహ్మణపల్లి రోడ్డు సమీపంలో ఉన్న రాజీవ్‌గృహకల్పలో నివసించే పిల్లి కృష్ణ (35) డేకరేషన్ పనులు చేసుకుంటూ భార్య, నలుగురు పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. పక్కనే అదే కాలనీలో ఉండే నర్సింహ ఇంట్లో పెళ్లి ఉందని పందిరి వేయాలని చెప్పాడు. దీంతో సోమవారం ఉదయం మూడో అంతస్తుపై పెళ్లి పందిరి వేస్తున్నాడు. కర్రజారి కింద పడడంతో భవనం నుంచి కింద పడిపోయాడు. తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పిల్లి కృష్ణ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మృతదేహంతో ఆందోళన
ఇంటి పెద్ద దిక్కు చనిపోవడంతో కుటుంబం దిక్కుతోచనిది అయ్యిందని, ఆదుకోవాలని కుటుంబ సభ్యులు, బంధువులు కృష్ణ మృతదేహంతో నర్సింహ ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. దీంతో అతను ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. రాత్రి వరకు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా అలాగే ఉంచారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


