ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి

Jun 19 2026 7:45 AM | Updated on Jun 19 2026 7:45 AM

ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి ఉప సర్పంచ్‌లకు ప్రాధాన్యం కల్పించండి నిస్వార్థ సేవలతో తగిన గుర్తింపు నేడు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి రాక

కేశంపేట: బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఫ్యూచర్‌సిటీ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి అన్నారు. కేశంపేట పోలీస్‌స్టేషన్‌ను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులు, కేసుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అయన మాట్లాడుతూ.. ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. పెండింగ్‌ కేసులను త్వరగా పూర్తి చేయాలని, శాంతిభద్రతల పరిరక్షణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సైబర్‌ నేరాలపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలన్నారు. గ్రామస్థాయిలో కమ్యూనిటీ పోలీసింగ్‌ను బలోపేతం చేయాలని, నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని చెప్పారు. ప్రజలకు పారదర్శకమైన, నాణ్యమైన సేవలను అందించాలని అన్నారు. కార్యక్రమంలో షాద్‌నగర్‌ డీసీపీ శిరీష రాఘవేందర్‌, ఏసీపీ లక్ష్మీనారాయణ, కేశంపేట ఎస్‌హెచ్‌ఓ నరహరి, ఎస్‌ఐ రాజ్‌కుమార్‌, పోలీసు సిబ్బంది ఉన్నారు.

కడ్తాల్‌: ఉప సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కమిటీ నాయకుడు లక్పతినాయక్‌ ఆధ్వర్యంలో గురువారం పలువురు ఉప సర్పంచ్‌లు రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ను హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. ఉప సర్పంచ్‌ చెక్‌ పవర్‌పై వస్తున్న వదంతులను ఖండించాలని, గౌరవ వేతనం అందించాలని, అభివృద్ధి కార్యక్రమాల్లో శిలఫలాకాలపై పేరు ఉండేలా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని వినతి పత్రం అందించారు.

ఆమనగల్లు: సమాజంలో నిస్వార్థంగా అందించే సేవలకు తగిన గుర్తింపు లభిస్తుందని మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌ కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. తలకొండపల్లి మండల కేంద్రంలో ఉప్పల చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో రూ.10 కోట్లతో ఉప్పల వెంకటేశ్‌ నిర్మించిన ఉప్పల బాలికల ఆశ్రమ పాఠశాలను గురువారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాలికలకు ఉచిత విద్య, వసతి అందించేందుకు కోట్లాది రూపాయల ఖర్చుతో ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం ఉప్పల వెంకటేశ్‌, మంజుల దంపతులను సత్కరించారు. కార్యక్రమంలో రజనిసాయిచంద్‌, శేషారెడ్డి, మలిపెద్ది శంకర్‌, గోపాల్‌రెడ్డి, నిర్మల శ్రీశైలంగౌడ్‌, శ్రీనివాస్‌రెడ్డి, సీఎల్‌ శ్రీనివాస్‌యాదవ్‌, గోపాల్‌నాయక్‌, డా. అఖిల్‌, డా.అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

కందుకూరు: మండలంలో శుక్రవారం వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి రానున్నట్టు బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్‌ సాధ మల్లారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మ అంజిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు శ్రీశైలం రహదారి మాధవన్‌జీ ఆస్పత్రి నుంచి లేమూరు మీదుగా బేగంపేట వరకు రూ.38 కోట్లతో చేపట్టబోయే నూతన రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని అన్నారు. తర్వాత బేగంపేట నుంచి ఎలిమినేడు వరకు రూ.17 కోట్లతో నిర్మించనున్న రహదారికి శంకుస్థాపన చేయనున్నట్టు చెప్పారు. అనంతరం మీర్‌ఖాన్‌పేట నుంచి కొంగర వరకు రూ.32 కోట్లతో నిర్మించనున్న నూతన రహదారికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement