ఆమనగల్లు: కులమతాలకు అతీతంగా దేశ సమైక్యత కోసం ఐక్యంగా ఉండాలని అఖిల భారత వనవాసి కళ్యాణక్షేత్ర సంఘటన ప్రముఖ్ రామచంద్రయ్య కోరారు. పట్టణంలోని సత్యసాయి మందిరంలో గురువారం సామాజిక సద్భావన సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రామచంద్రయ్య మాట్లాడుతూ.. కుల రాజకీయాలతో దేశ సౌభాగ్యం, సమైఖ్యతకు భంగం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు కులాలను స్వప్రయోజనాలకు వాడుకుంటున్నాయని ఆరోపించారు. గడప లోపల కులం, గడప దాటితే హిందువులం అనే భావనతో సమైఖ్యత కోసం కృషి చేయాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్ పాపిశెట్టి రాము, మార్కెట్ వైస్ చైర్మన్ తోట గిరియాదవ్, మాజీ కౌన్సిలర్ లక్ష్మణ్, నాయకులు దొంతు సత్యానారాయణ, విశ్వనాథం, తిరుపతయ్య, అల్లాజీ, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.


