వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారి
అనంతగిరి: మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటు పడుదామని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. వనమహోత్సవంలో భాగంగా గురువారం అనంతగిరి – కొండాపూర్ రిజర్వు ఫారెస్ట్ ఏరియలో ఎస్పీ స్నేహ మెహ్ర, మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య, అదనపు కలెక్టర్ వెంకటాచారి, ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూర్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మొక్కల పెంపకం మన బాధ్యత
కుల్కచర్ల: మొక్కల పెంపకం ప్రతి ఒక్కరి బాధ్యత అని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం వనమహోత్సవంలో భాగంగా కుల్కచర్లలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలే మానవ మనుగడకు ముఖ్య కారణమన్నారు. పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు, డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కనకం మొగులయ్య, పాంబండ ఆలయ మాజీ చైర్మన్ మైపాల్ రెడ్డి, స్థానిక సర్పంచ్ అంజిలయ్య, మాజీ ఎంపీపీ పడమటి అంజిలయ్య, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఆనందం, సర్పంచులు తిరుపతయ్య, మడుగు శ్రీనివాస్, వెంకటయ్య, నాయకులు గోవర్దన్‌రెడ్డి, రాంచంద్రయ్య, జోగు వెంకటయ్య, భరత్‌కుమార్ రెడ్డి, లాలు తదితరులు పాల్గొన్నారు.
మొక్కలతోనే మానవ మనుగడ
తాండూరు: మొక్కలు నాటి, పచ్చదనాన్ని పెంచితేనే మానవ మనుగడ సాధ్యమని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం ప్రారంభించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్‌జాదవ్, నాయకులతో కలిసి మొక్కలు నాటి మాట్లాడారు. తాండూరు ప్రాంతంలో వాతావరణ కాలుష్యం అధికంగా ఉన్నట్లు పీసీబీ గుర్తించిందని తెలిపారు. ఇప్పుడు మొక్కలు నాటి కాలుష్యాన్ని తగ్గించడమే మనముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, అటవీ శాఖ రెంజ్ అధికారి శ్రీదేవి సరస్వతి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగరాజ్, తాండూరు సర్ కన్వీనర్ కరణం పురుషోత్తంరావు, నాయకులు తదితరులున్నారు.


