మంచాల: విద్యారంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్న కృషి మరువలేనిదని టీపీసీసీ సభ్యుడు, ఆదిబట్ల మున్సిపల్ మాజీ చైర్మన్ మర్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆరుట్ల టీపీఎస్ పైలాన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన సీఎంను కలిసి ఘనంగా సన్మానించారు.
సీఎంకు ఆరుట్ల సర్పంచ్ వినతి
గ్రామ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరుతూ ఆరుట్ల సర్పంచ్ మానుపాటి శోభాకుమార్ బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు మినీస్టేడియం, ఆరుట్ల–బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ ఇతర సమస్యల పరిష్కారానికి రూ.10 కోట్లు నిధులు మంజూరు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కాలుష్యరహిత పరిశ్రమలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పాత పంచాయతీ కార్యాలయ స్థలంలో వాణిజ్య సముదాయం నిర్మాణానికి నిధులు కేటాయించాలన్నారు. కృష్ణాజలాలు సరిపడా అందిచాలని కోరారు.
ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన టీపీస్ పైలాన్ ప్రారంభోత్సవానికి ఆరుట్లకు విచ్చేసిన సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఫార్మాసిటీ నిషేధిత జాబితాలో రైతుల పేర్లు తొలగించాలని, ఫ్యూచర్ సిటీ పేరిట బలవంతపు భూ సేకరణ నిలిపి వేయాలని, రామోజీ ఫిల్మ్‌సీటి, ప్యాబ్‌సిటీలోని ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు సామేల్, రామచందర్, కె.జగన్, రావుల జంగయ్య, నర్సింహ తదితరులు ఉన్నారు.
సభలో ప్లకార్డుల ప్రదర్శన
సీఐటీయూ మంచాల మండల కో కన్వీనర్ పోచమోని కృష్ణ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం కార్మికులు సీఎం బహిరంగ సభలో నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కారం చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. పేదలకోసం పని చేస్తామని చెప్పే సీఎం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆ సంఘం నాయకురాలు స్వప్న, కల్పన, సరిత, పద్మ, రాధ, శిరీష, లక్ష్మిబాయి, మంజుల, స్రవంతి, సైదులమ్మ, బాలమణి తదితరులు పాల్గొన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ జిల్లా విభాగంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ బలవన్మరణానికి పాల్పడిన శ్రీధర్‌బాబు కుటుంబ సభ్యులు సైతం సీఎం సభలో ఆందోళన చేపట్టి శ్రీధర్‌బాబు ఫొటోతో కూడిన ప్లకార్డును పదర్శించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
శంకర్‌పల్లి: ఓటర్ల ప్రత్యేక ‘సమగ్ర సవరణ సర్వే’(ఎస్‌ఐఆర్)లో ఏ ఒక్క పౌరుడు తమ ఓటు హక్కును కోల్పోకుండా చూడాలని చేవెళ్ల ఆర్డీఓ పార్థసింహారెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో బీఎల్‌ఓ, బీఎల్‌ఓ సూపర్‌వైజర్లలకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీఓ మాట్లాడుతూ.. ఈనెల 25 నుంచి సర్వే ప్రారంభం అవుతుందని, బీఎల్‌ఓ, బీఎల్‌ఓ సూపర్‌వైజర్లకు అప్పగించిన పనిని సమర్థవంతంగా పూర్తి చేయాలన్నారు. 2002లో విడుదల చేసిన ఓటరు లిస్టు ఆధారంగా ఈ ప్రక్రియ జరుగుతుందని, లిస్టు ఇప్పటికే గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఉంచామని తెలిపారు. సర్వే సమయంలో సమస్య తలెత్తితే వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో శంకర్‌పల్లి తహసీల్దార్ సురేందర్, డిప్యూటీ తహసీల్దార్ బాలకృష్ణారెడ్డి, మాస్టర్ ట్రైనర్లు ఆశీర్వాదం, బాలాజీ పాల్గొన్నారు.
చేవెళ్ల ఆర్డీఓ పార్థసింహారెడ్డి


