సర్కార్‌ బడుల బలోపేతానికి సర్పంచ్‌ల యత్నం | - | Sakshi
Sakshi News home page

సర్కార్‌ బడుల బలోపేతానికి సర్పంచ్‌ల యత్నం

Jun 18 2026 8:04 AM | Updated on Jun 18 2026 8:04 AM

ఆమనగల్లు: ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించే తల్లిదండ్రులకు ఇంటి బిల్లు తానే చెల్లిస్తానని సీతారాంనగర్‌ తండా సర్పంచ్‌ సరిత గోపాల్‌నాయక్‌ ప్రకటించారు. బుధవారం ఆమె సీతారాంనగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించిన తల్లిదండ్రులకు నజరానాగా వారి ఇంటిపన్నులు సర్పంచ్‌గా తానే భరిస్తానని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, యునిఫాం అందించడంతో పాటు మధ్యాహ్న భోజనం ఉంటుందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సర్కార్‌బడిలో చదివిన స్థానికులు సహకారం అందించాలని కోరారు.

గ్రామస్తులకు ఆదర్శంగా..

మండల పరిధిలోని శెట్టిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్‌ జంగమ్మ తన కూతురుని చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలంటూ ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్న ఆమె తన కూతురిని సర్కార్‌బడిలో చేర్పించి గ్రామస్తులకు ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని కోరారు.

చిప్పలపల్లిలో ప్రాథమిక పాఠశాలకు సర్పంచ్‌ పిల్లలు

కందుకూరు: ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతున్న తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అందరికి ఆదర్శంగా నిలిచారు చిప్పలపల్లి సర్పంచ్‌ సురమోని లలితకుమార్‌ దంపతులు. నేదునూరులో ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతున్న తమ పిల్లలు రిషికేశ్‌ను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాల్గవ తరగతిలో, వర్షిణిని రెండో తరగతిలో చేర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాందాస్‌, ఉపాధ్యాయులు రాజు, శ్రీరాం, సుధాలత, జగన్‌ వారికి పుస్తకాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఉప సర్పంచ్‌ లావణ్యప్రవీణ్‌, వార్డు సభ్యులు బాల్‌రాజు, గ్రామస్తులు శేఖర్‌రెడ్డి, అంజయ్య, పాలమేశ్‌, ఎల్లయ్య, రమేశ్‌, బాలకృష్ణ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఆదర్శంగా నిలుస్తున్న గ్రామ ప్రథమ పౌరులు

పిల్లల్ని చేర్పించిన తల్లిదండ్రులకు నజరానాలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement