కేశంపేట: మండలంలో కొందరు అక్రమంగా ఎర్ర మట్టి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. రైతుల నుంచి మట్టిని కొనుగోలు చేసి మండల పరిధిలోని అల్వాల గ్రామ శివారులోని సబ్‌స్టేషన్ సమీపంలో అక్రమంగా డంపింగ్ చేస్తున్నారు. అర్ధరాత్రి వేళలో పొలాల్లో నుంచి మట్టిని తీసుకువచ్చి హైదరాబాద్, షాద్‌నగర్, తుక్కుగూడ, మహేశ్వరం లాంటి ప్రాంతాలకు టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. రెవెన్యూ అధికారులకు వేములనర్వ గ్రామానికి చెందిన తుమ్మల శ్రీనివాస్ ఈ నెల 15 తహసీల్దార్‌కు తన పొలంలో నుంచి పొల్కోనిగుట్ట తండాకు చెందిన ఓ వ్యక్తి అక్రమంగా మట్టిని తరలించినట్లు ఫిర్యాదు చేశాడు. మండలంలో అక్రమంగా రాత్రి వేళలో మట్టి వ్యాపారం జరుగుతున్నా రెవెన్యూ అధికారులు, పోలీసులు స్పందించడం లేదని వాపోతున్నాడు.
చేవెళ్ల: ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహానికి భవనం లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నారని ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అరుణ్‌కుమార్ అన్నారు. బుధవారం ఆర్డీఓ పార్థసింహారెడ్డికి చేవెళ్లలో నూతనంగా నిర్మిస్తున్న లైబ్రరీ భవనాన్ని ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహానికి కేటాయించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. 2018లో చేవెళ్లకు ఎస్సీ బాలుర, బాలికల కళాశాలల వసతి గృహాలు మంజూరైనట్లు తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయన్నారు. చేవెళ్లలో నూతనంగా నిర్మిస్తున్న లైబ్రరీ భవనాన్ని ఎస్సీ బాలికల వసతిగృహానికి కేటాయించాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి మాల చందు తదితరులు ఉన్నారు.


