జీఓల్లోనే జీతాలు! | - | Sakshi
Sakshi News home page

జీఓల్లోనే జీతాలు!

Jun 18 2026 7:58 AM | Updated on Jun 18 2026 7:58 AM

ప్రభుత్వం స్పందించాలి

చేవెళ్ల: వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ (గతంలో 104 ఉద్యోగులు) సిబ్బందికి 15 నెలలుగా వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 104లో 1,043 మంది ఉద్యోగులు ఆయా జిల్లాల్లో వైద్యారోగ్య శాఖలో నాన్‌టెక్నికల్‌ ఉద్యోగులు(డ్రైవర్‌, డీఈఓ, సెక్యూరిటీ) 525 మంది, డీఎంఈఓ(డిస్ట్రిక్ట్‌ మెడికల్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌)లోకి, టెక్నికల్‌ ఉద్యోగులు(ఫార్మసిస్ట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్స్‌) 518 మందిని డీఎంఈ, ఆయుష్‌, సీఎస్‌హెచ్‌లకు సర్దుబాటు చేసి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా వీరి సేవలను వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 44 మంది ఉద్యోగులను సర్దుబాటు చేసినప్పటికీ వీరికి ఇవ్వాల్సిన జీతాల బడ్జెట్‌కు సంబంధించిన ప్రత్యేక ఉత్వర్వులు లేక జీతాలు సక్రమంగా అందుకోలేకపోతున్నారు.

రూ.20.05కోట్లు చెల్లింపునకు జీఓ

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 2008 నంవబర్‌లో గ్రామీణ ప్రాంతాల్లో బీపీ, షుగర్‌, ఆస్తమా, క్షయతో బాధపడే వారికి, గర్భిణులు, బాలింతలకు, పిల్లలకు నెలవారీగా వారి గ్రామాల్లో ఆరోగ్య సేవలు అందిస్తూ మందులు పంపిణీ చేసేందుకు 104–ఎఫ్‌డీహెచ్‌ఎస్‌ సేవలను ప్రారంభించిన విషయం విదితమే. వైఎస్‌ఆర్‌ మరణానంతరం జరిగిన అనేక పరిణామాలతో ఈ 104 సేవలను నిర్వీర్యం చేశారు. అప్పటీకే ఏళ్లతరబడిగా ఈ ఉద్యోగాల్లో చేరిన ఉద్యోగులు సమ్మెలు, పోరాటాలు చేయడంతో వారిని కొన్నాళ్లు కొనసాగించారు. ఆ తరువాత వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోపాటు ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం వారిని వైద్యారోగ్యశాఖలోని పలు విభాగాల్లో సర్దుబాటు చేసి సేవలు వినియోగించుకుంటున్నారు. 2025 ఏప్రిల్‌ నుంచి నేటి వరకు 15 నెలల కాలానికి సంబంధించిన జీతాలు (సర్దుబాటుకు ముందు పది నెలలు, తరువాత ఐదు నెలలు) మాత్రం అందలేదు. ఉద్యోగుల పోరాటంతో పెండింగ్‌లో పది నెలల జీతాలు రూ.20.05కోట్లు చెల్లింపునకు 2026 మార్చి 28న బీఆర్‌ఓ నెం 459 ద్వారా బడ్జెట్‌ విడుదల ఉత్వర్వులు జారీ చేసింది కానీ జీతాలు మాత్రం అందలేదు.

15 నెలలుగా ఎదురు చూపులు

2026లో ఉత్వర్వులిచ్చినా నేటికీ వేతనాలు అందని వైనం

ఇబ్బంది పడుతున్న 1,043 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు

గతంలో 104లో పనిచేసిన మా పరిస్థితి దుర్భరంగా మారింది. జీతాలు రావడం లేదనే విషయాన్ని ఉద్యోగులంతా పలుమార్లు ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకుపోగా 2026 మార్చి 28న పాత బకాయి చెల్లింపునకు ఉత్వర్వులు జారీ చేశారు. నేటికీ జీతాలు అందక ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్నాం. కుటుంబ ఖర్చులు, పిల్లల చదువులు, వైద్యఖర్చులు, తదితర వాటి భారం భరించలేనంతగా పెరిగిపోతోంది. జీతాలకోసం ప్రభుత్వంలోని పెద్దలను, ఉన్నతాధికారులను కలిసి విన్నవించినా పట్టించుకునేవారే కరువయ్యారు. ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కరించాలి.

– పి.శివకుమార్‌, 104 ఉద్యోగుల సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement