● బీఆర్‌ఎస్ ఒత్తిడితోనే పాలమూరు ప్రాజెక్టు పనులు వేగిరం
● మాజీ మంత్రి సబితారెడ్డి
షాద్‌నగర్: ప్రజా హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ఆరోపించారు. బుధవారం పట్టణంలోని కుంట్ల రాంరెడ్డి గార్డెన్‌లో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఓటరు సమగ్ర సర్వేపై పార్టీ నాయకులు, కార్యక్తలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రజలకు అలవికాని హామీలిచ్చి విఫలమయ్యారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పార్టీ నాయకుల, కార్యకర్తలు గ్రామాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఓటరు సమగ్ర సర్వే సక్రమంగా జరిగేలా బూత్‌స్థాయి ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఈ అంశంపై పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ తరగతులు ఉంటాయని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పై బీఆర్‌ఎస్ ఒత్తిడితోనే ప్రభుత్వం పనులను వేగిరం చేసిందన్నారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ... లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం ఆలోచన కేసీఆర్‌దే అన్నారు. ప్రాజెక్టు పనులు గతంలో నిలిచిపోవడానికి కాంగ్రెస్ నాయకులు వైఖరే కారణమని ఆరోపించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, పార్టీ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి శ్రీనివాస్ యాదవ్, నాయకులు నారాయణరెడ్డి, రవీందర్ యాదవ్, రాజావరప్రసాద్, నరేందర్, నట్‌రాజ్, శ్రీనివాస్‌గౌడ్, ఈట గణేశ్, రాంబల్ నాయక్, లక్ష్మీనర్సింహారెడ్డి, మిట్టు నాయక్, లక్ష్మణ్ నాయక్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


