డంపింగ్‌యార్డు రాదు | - | Sakshi
Sakshi News home page

డంపింగ్‌యార్డు రాదు

Jun 18 2026 7:58 AM | Updated on Jun 18 2026 7:58 AM

కొత్తూరు: సిద్ధాపూర్‌లో ఎట్టి పరిస్థితుల్లో డంపింగ్‌యార్డు ఏర్పాటు కాకుండా చూస్తానని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ భరోసా ఇచ్చారు. బుధవారం ఆయన మండల పరిధిలోని ఇన్ముల్‌నర్వ గ్రామంలో జేపీదర్గాలో బంధువులు నిర్వహించిన విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో కలిసి దర్గాలో బాబాకు చాదర్‌కు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం సిద్ధాపూర్‌, ఇన్ముల్‌నర్వ గ్రామాలకు చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు డంపింగ్‌యార్డు ఏర్పాటు చేయొద్దని ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఇందుకు స్పందించిన ఆయన మాట్లాడుతూ.. ప్రజల అభిప్రాయాలు, ఇష్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోదని తేల్చిచెప్పారు. సిద్ధాపూర్‌లో డంపింగ్‌యార్డు కోసం ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనను ఎవరికి ఇబ్బందులు లేనిచోటుకు తరలించేందుకు కృషి చేస్తామన్నారు. గత ప్రభుత్వంలోనే డంపింగ్‌యార్డు కోసం బీజాలు పడ్డాయని ఎమ్మెల్యే శంకర్‌ తెలిపారు. భూసేకరణ తర్వాత టీజీఐఐసీకి భూములు బదలాయించే సమయంలో ఫలానా పరిశ్రమలకు కేటాయిస్తున్నట్లు నమోదు చేయలేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే జనరల్‌ కేటగిరిలో పెట్టడంతో సమస్య తలెత్తిందని వివరించారు. టీజీఐఐసీ పరిశ్రమలకు అప్పుడే పొలాలు కేటాయించి ఉంటే ఇప్పుడు సమస్య ఉండేదికాదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఎల్లారం శేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్‌, సుదర్శన్‌గౌడ్‌, రాజునాయక్‌, దయానంద్‌గుప్తా, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ భరోసా

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement