ఆమనగల్లు: కల్వకుర్తి నియోజకవర్గ యువతకు ఏఐ, ఐటీపై ఉచిత శిక్షణ తరగుతులు నిర్వహించనున్నట్లు టాస్క్ సీఈఓ, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన బుధవారం యూఎస్‌ఏకు చెందిన ఇన్‌ఫోడాట్ గ్లోబల్ ఇంక్ సంస్థతో ఐక్యత ఫౌండేషన్ ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. కల్వకుర్తిని స్కిల్ హబ్‌గా మార్చేందుకు ఇన్‌ఫోడాట్ గ్లోబల్ ఇంక్ ఫౌండర్, సీఈఓ మల్లారెడ్డి బృందంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కల్వకుర్తి నియోజకవర్గ యువతకు ప్రపంచస్థాయి సాంకేతిక నైపుణ్యాలు అందించి అంతర్జాతీయ ఉపాధి అవకాశాలకు సిద్ధం చేస్తామన్నారు. గ్రామీణ యువత ప్రతిభను వెలికితీసి వారికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతో భవిష్యత్ తరాలకు మెరుగైన అవకాశాలు కల్పించవచ్చన్నారు. ఏఐ, ఐటీ రంగాల్లో ఉద్యోగాలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు, కమ్యూనికేషన్, ఇంటర్వ్యూ స్కిల్స్, డిజిటల్ టూల్స్ వినియోగంపై అవగాహన, జాతీయ, అంతర్జాతీయ కంపెనీల అవసరాలకు అనుగుణమైన శిక్షణ, ఫ్రీ లాన్సింగ్, రిమోట్ వర్క్ అవకాశాలపై మార్గదర్శకత్వం, కెరియర్ గైడెన్స్ వంటి అంశాలలో ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు.
టాస్క్ సీఈఓ రాఘవేందర్‌రెడ్డి


