కందుకూరు: ఫార్మాసిటీ కోసం పట్టా భూములు ఇచ్చేది లేదని మండల పరిధిలోని ముచ్చర్ల, ఊట్లపల్లి, సాయిరెడ్డిగూడ రైతులు తేల్చి చెప్పారు. ఫ్యూచర్‌సిటీ ఏర్పాటులో భాగంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 300 ఎకరాల మేర పట్టా భూములు సేకరించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు నిరసనగా బుధవారం ముచ్చర్లలో రైతులు ప్రత్యేకంగా సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రభుత్వం అసైన్డ్ భూములను తీసుకుందని.. ఉన్న కొద్ది పట్టా భూములను సైతం రైతుల అంగీకారం లేకుండా తీసుకోనున్నట్లుగా భూముల ధరలు పెంచే ఒక్క రోజు ముందు నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదన్నారు. భూ సేకరణకు వచ్చే అధికారులను గ్రామంలోకి రానీయమన్నారు. పట్టా భూములు తీసుకుంటే తాము ఎలా బతకాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవి, స్థానిక నాయకుడు లక్ష్మణ్‌ముదిరాజ్, రైతులు పాల్గొన్నారు.
● అధికారులను గ్రామంలోకి రానీయం
● ముచ్చర్లలో రైతుల తీర్మానం


