క్వారీ.. ప్రమాదానికి దారి | - | Sakshi
Sakshi News home page

క్వారీ.. ప్రమాదానికి దారి

Apr 20 2026 9:29 AM | Updated on Apr 20 2026 9:29 AM

షాద్‌నగర్‌/యాచారం: ప్రయోజనం పొందింది ఒకరు.. నష్టపోతుంది మరొకరు.. ఎవరో వ్యాపారులు క్వారీలు తవ్వుకొని లబ్ధి పొందితే సామాన్యులు అందులో పడి బలవుతున్నారు. అయినా ఎవరూ అటువైపు కన్నెత్తి చూడడం లేదు. నిబంధనలకు అనుగుణంగా వాటిని పూడ్చకుండా వదిలేయడంతోనే ఏటా పదుల సంఖ్యలో వాటిలో పడి మృత్యువాతపడుతున్నారు.

20 ఏళ్ల క్రితం తవ్వకాలు

షాద్‌నగర్‌ పరిధిలోని లింగారెడ్డిగూడ శివారులో ఉన్న క్వారీ ప్రమాదకంగా మారింది. 20 ఏళ్ల క్రితం ఓ వ్యాపారి రైతుల వద్ద భూమిని అద్దెకు తీసుకొని క్వారీ పరిశ్రమ నిర్వహించారు. బండరాళ్ల కోసం లోతుగా తవ్వకాలు చేపట్టారు. సుమారు ఏడేళ్ల క్రితం వరకు క్వారీ పరిశ్రమను నిర్వహించడంతో లోతైన గుంతలు ఏర్పడ్డాయి. ఈ క్వారీ గుంతల్లో ఈతకు వెళ్లి ఇప్పటికే ఎంతోమంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం క్వారీ నీటితో నిండింది. చుట్టు పక్కల ముళ్ల చెట్లు మొలిచాయి. చెట్ల మధ్యలో ఉన్న చిన్నదారుల గుండా వేసవిలో విద్యార్థులు, చిన్నారులు క్వారీలోకి ఈత కొట్టేందుకు వెళ్తున్నారు. ప్రమాదమని తెలిసినా దీన్ని పూడ్చడం లేదు.

నిబంధనలకు పాతర

ఇక్కడ కొన్నేళ్లుగా తవ్వకం పనులు నిలిచిపోయాయి. వ్యాపారులు పూడ్చకుండా వదిలేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. నిబంధనల ప్రకారం వ్యాపారులు తమ లీజు పూర్తయిన తర్వాత క్వారీ గుంతలను పూడ్చాల్సి ఉంటుంది. అందులో చెట్లు నాటి పర్యావరణ కోసం పాటుపడాలి. ఎక్కడా నిబంధనలు అమలు కావడం లేదు.

ప్రాణాలు తీస్తున్నక్వారీ గుంతలు

ఏటా పదుల సంఖ్యలో మృత్యువాత

నిబంధనలు పట్టని వ్యాపారులు

చూసీచూడనట్టు వదిలేస్తున్న అధికారులు

క్వారీ గుంతలు ప్రమాదకరంగా మారాయి.. లోతు తెలియక చిన్నారులు సరదాగా ఈత కొడుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.. కన్నవారికి గుండెకోత మిగులుస్తున్నారు.. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు..

Advertisement
 
Advertisement
Advertisement